AP High Court Interim Orders on YCP Offices Demolition : వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల వివరాలను 2 నెలల్లోగా అధికారుల ముందు ఉంచాలని వైసీపీని ఆదేశించింది. అలాగే అధికారులు తొందరపాటు చర్యలకు ఉపక్రమించొద్దని, వైసీపీ ఇచ్చే వివరణను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది.
కార్యాలయాల్లో కూల్చివేతల విషయంలో ఖచ్చితంగా చట్ట నిబంధనలను పాటించాలని తెలిపింది. తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్నారంటూ.. కొందరు వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. వాటిపై జూన్ 26న విచారణ చేసిన న్యాయస్థానం స్టేటస్ కో విధించింది.
ఎలాంటి అనుమతులు లేకుండా.. వైసీపీ తన ఇష్టారాజ్యంగా ఈ కార్యాలయాలను నిర్మించిందని ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం. గతనెలలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో వైసీపీ భవనాలను నిర్మించిందన్న విషయం బయటికొచ్చింది. వాటిలో కొన్ని పూర్తవ్వగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాల కోసం వందల కోట్ల రూపాయల్ని ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
జగన్ రెడ్డి అధికార దాహానికి అంతులేకుండా పోయిందని నారా లోకేశ్ అప్పుడే ఫైరయ్యారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వైసీపీ కార్యాలయాలను నిర్మించారో పూసగుచ్చినట్లు వివరించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ప్రజల సొమ్మును జగన్ ఇలా జిల్లాల ప్యాలెస్ ల నిర్మాణాలకు తగలేశాడని విమర్శించారు. పేద ప్రజలకు ఇళ్లు కట్టించేందుకు మనసొప్పని జగన్.. తన స్వార్థం కోసం ఇలా జిల్లా కార్యాలయాలను నిర్మించుకోవడం దారుణమన్నారు.