ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ కు కేంద్రం నుంచి వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు డిల్లీ టూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలపగా..
మరో కేంద్ర మంత్రి ఏకంగా రూ.60 వేల కోట్ల ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో దీనిపై చర్యలు ప్రారంభం కానున్నాయి.
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంగీకారం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నిన్న ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందని చంద్రబాబు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి కేంద్రమంత్రి కూడా ఏకీభవించారు.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి చంద్రబాబు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి.. బందరులో బీపీసీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు 2 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. అంతకన్నా ఎక్కువగా అవసరమైనా కేటాయించేందుకు సిద్దమని బందరు ఎంపీ బాలశౌరి కేంద్రమంత్రికి తెలిపారు. దీంతో త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన చేస్తామని హర్దీప్ సింగ్ పూరీ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశముంది.
వాస్తవానికి ఈ భారీ ప్రాజెక్టుకు తొలుత కాకినాడను కేంద్రం ఎంచుకున్నప్పటికీ రాజధానికి దగ్గరగా ఉండటం, భూమి లభ్యత వంటి కారణాలతో బందరుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బీపీసీఎల్ రిఫైనరీ రాకతో రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకూ వీలవుతుందని బందరు ఎంపీ బాలశౌరి వెల్లడించారు.