తెలంగాణలో రెండు రోజుల సెలవులు

www.mannamweb.com


తెలంగాణలో రెండు రోజుల సెలవులు

Holidays in Telangana: మొహర్రం పండగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 9, 10 తేదీల్లో సెలవు ఇచ్చినట్లు వెల్లడించింది. గతంలో విడుదల చేసిన హాలిడే క్యాలెండర్‌లో ఈ మేరకు మార్పులు చేసింది.

గతంలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మొహర్రం, అషూరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఈ నెల 16, 17 తేదీల్లో సెలవులు ఉండేవి. 16న ఆప్షనల్, 17న సాధారణ సెలవుగా గుర్తించింది. నెలవంక కనిపించడానికి అనుగుణంగా సవరణలు చేసింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మొహర్రం, అషూరా సెలవులను ఇచ్చింది.

మొహర్రం పండుగను ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెలగా భావిస్తారు. దీన్ని సంతాప మాసంగా జరుపుకొంటారు ముస్లింలు. మొహర్రం నెల ప్రారంభమైన 10వ రోజున షియా ముస్లింలు పీర్లను ఊరేగిస్తారు. సున్నీ ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ సమయంలో కొత్త బట్టలు సైతం కొనుగోలు చేయరు. శుభకార్యాలకు దూరంగా ఉంటారు.

మహమ్మద్ ప్రవక్త మనవళ్లు ముస్లింలు ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుస్సేన్‌ త్యాగాలను స్మరించుకుంటూ మొహ్రరం వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విషాదానికి గుర్తుగా నల్ల దుస్తులను ధరిస్తారు. పీర్లను ఊరేగిస్తారు. హైదరాబాద్ పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా పీర్లపండగను ఘనంగా జరుపుకొంటారు.

6వ తేదీన చంద్రుడు కనిపించనందున- మొహర్రం మాసం 8 నుంచి ప్రారంభమవుతుందని మస్జిద్-ఇ-నఖోడా మర్కాజీ, రూయత్-ఎ-హిలాల్ కమిటీ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో సాధారణంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర గల్ఫ్ దేశాల కంటే ఒక రోజు ఆలస్యంగా నెలవంక కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా దేశాల్లో పండగ జరుపుకొంటారు.