AP Government Officers: పోస్టుల కోసం.. ఏపీ అధికారుల లాబీయింగ్

www.mannamweb.com


AP Government Officers: పోస్టుల కోసం.. ఏపీ అధికారుల లాబీయింగ్

AP Government Officers Lobbying for Posts: ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారు. వారి మాటే వేదమన్నట్లు.. రూల్స్ పక్కనపెట్టి ఏం చేయమంటే అది చేసి చూపిచ్చారు. అలాంటి స్వామిభక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్లేట్ మారుస్తున్నారు. ఇప్పుడు తిరిగి పవర్ ఎంజాయ్ చేయడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుకుంటూ కీలక స్థానాలలో పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. దాంతో అర్హత ఉన్నా వివిధ కారణాలతో లూప్ లైన్ లో ఉన్న అధికారులు ఇదేం గోలని టెన్షన్ పడుతున్నారంట.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హాయంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్, రెవెన్యూ లాంటి కీలక విభాగాలలో పోస్టింగ్ విషయంలో జరిగిన తంతుపై రాష్టమంతా నివ్వెర పోయింది. కొంతమందికి అసలు పోస్టింగ్ ఇవ్వడం అటుంచి కనీసం లూప్ లైన్ లో అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వారు మూడు సంవత్సరాల పాటు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారు రాష్ట వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. సమర్థత ఉన్నప్పటికి వర్గం , సానుభూతి పరుడు లాంటి కారణాలతో ఇబ్బంది పెట్టారు. పోలీసు, రెవెన్యూ విభాగాలలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది.

పలువురు అధికారులు గత ప్రభుత్వంలో చాలా హడావుడి చేసారు. కీలక స్థానాలో పనిచేశారు. మాజీ సీఎం జగన్‌కు ఆప్తులైన నాయకులు ఏం చెబితే అదే చేశారు. దాంతో టీడీపీ, జనసేన నాయకులు అప్పట్లో వారికి టార్గెట్ అయి పలు సమస్యల్లో ఇరుక్కున్నారు. అప్పట్లో టిడిపి శ్రేణులు అటువంటి అధికారులు, నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఎన్నికల పోలింగ్ , తర్వాత కౌంటింగ్ కు ముందు కూడా టీడీపీ , కూటమి నాయకులపై చంద్రగిరి, తిరుపతి, పుంగనూరు లాంటి చోట్ల కేసులు నమోదు చేసారంటే ఎంత స్వామి భక్తిని ప్రదర్శించారో అర్థం అవుతుంది.

ఇలాంటి వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అధికారం మారడంతో.. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుతూ.. గతంలో వారికి సన్నిహితులమని చెప్పుకుంటూ పోస్టింగ్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కీలక పోస్టుల కోసం పెద్ద మొత్తం డబ్బులు ఇస్తామని ప్రతిపాదనలు కూడా పెడుతున్నారంట. తిరుపతి నగర పాలక సంస్థలో మాస్టర్ ప్లాన్ రహాదారులు, టిడిఅర్ బాండ్స్‌ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఓ అధికారి అయితే నేను మీవాడినే గతంలో మీతోనే తిరిగాను. గత్యం తరం లేక వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందంటూ.. ఎంతైనా ఇస్తాను తనను ఆ పోస్టులోనే కొనసాగించమని నాయకుల చుట్టు తిరుగుతున్నాడంట. అయితే అతని గురించి తెలిసిన వారు సిఫార్సు చేయడానికి భయపడుతున్నారంట.

ఇక పోలీసు విభాగంలోని గత ఐదు సంవత్సరాలు హాడావుడి చేసిన వారు సైతం ఇప్పుడు తాము చాల నిజాయితీగా పనిచేసామని.. అంతేకాక చాలా సార్లు కేసుల నుంచి బయట పడవేసామంటూ అంటు ఎమ్మెల్యేల చుట్టు తిరుగుతున్నారంట. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మీరు గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ పోస్టింగ్ చేసారో వివరాలు ఇవ్వండి పరిశీలిస్తామని అంటున్నారంట. గతంలో వారు ఎక్కడా పనిచేసారో అయా ప్రాంతాల టీడీపీ నాయకులతో మాట్లాడి వారి గురించి ఎంక్వైయిరీ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చి కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేల చుట్టు ప్రదక్షిణాలు ఎక్కువుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వారితో సన్నిహితంగా మెలిగిన వారు మీకోసం అప్పడు చేసాము. ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి అని వత్తిడి తేస్తున్నట్లు సమాచారం. అయితే సిఐ నుంచి పైస్థాయి అధికారుల బదిలీలన్నీ పై నుంచి నడుస్తాయని చెప్పడంతో సదరు అధికారులు బిక్కచచ్చిపోతున్నారంట. వారి లాబీయింగ్ వ్యవహారం చూస్తూ.. గత ఐదు సంవత్సరాలుగా అర్హతలకు తగ్గ పోస్టింగ్‌లు లేక రాష్టం నలుమూలాల విసిరి వేయబడ్డ వారంతా ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహపడే పరిస్థితులు వచ్చాయంట.

రెవెన్యూ శాఖలో సైతం ఇలాంటి దందా నడుస్తోంది. అడ్డగోలుగా పనిచేసి అక్రమాలకు సహాకారించిన అధికారులు.. మీకు కూడా ఇలాగే పనిచేస్తాం.. మాకు అవకాశం ఇవ్వండి.. రెవెన్యూ లొసుగులతో మీకు లాభాలు కల్పిస్తామని అధికార నేతలకు ఓపెన్ అఫర్లు ఇస్తున్నారంట. అయితే అప్పట్లో ఇక్కట్లు ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులు వఓకే చెప్పడం లేదంటున్నారు. ఆర్డీఓ స్థాయి అధికారుల వ్యవహారం అంతా పై వారు చూసుకుంటారని ఎంఆర్వోతో పాటు కింది స్థాయి సిబ్బంది అయితే తాము చూస్తామని గతంలో తమను ఇబ్బందిపెట్టిన మీకు సహకరించే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారంట. మొత్తం మీద అధికార మార్పిడి తర్వాత పోస్టింగ్‌ల కోసం పోలీసులు ,రెవెన్యూలో తెగ లాబీయింగ్ జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఓ, మున్సిపాలిటీల్లో కూడా ఇదే తతంగం నడుస్తోందంట. చూడాలి మరి వారి లాబీయింగులు ఎంత వరకు పనిచేస్తాయో.