ఇటీవల కాలంలో అందరికీ సేవింగ్స్ అకౌంట్ ఉంటోంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో తమ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జీరో బ్యాలెన్స్ ఖాతాలను పెద్ద ఎత్తున ప్రారంభింపజేయడంతో దాదాపు ప్రతి పౌరుడికి సేవింగ్ ఖాతా ఉంది.
అంతేకాక ఆ సేవింగ్స్ ఖాతాను యూపీఐకి కనెక్ట్ చేసుకొని లావాదేవీలను నిర్వహిస్తున్నారు. కొన్ని సార్లు నగదు విత్ డ్రా చేస్తారు. మరికొన్ని సార్లు నగదును డిపాజిట్ చేస్తారు. అయితే ఈ లావాదేవీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి.. మీరు చేసే ప్రతి లావాదేవీపై ఆదాయ పన్ను శాఖ ఓ కన్నేసే ఉంచుతుంది. నిర్ణీత పరిమితి దాటి లావాదేవీ జరిపితే అది ఆదాయ పన్ను శాఖ గుర్తిస్తే.. మీకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అందుకే నగదు డిపాజిట్, విత్ డ్రాలకు సంబంధించి నిబంధనలు పాటించడం ముఖ్యం.
డిపాజిట్ పరిమితి ఎంతంటే..
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్‌పై పరిమితి ఉంది. అంటే, నిర్ణీత వ్యవధిలో బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి నగదు లావాదేవీలపై నిఘా ఉంచేందుకే ఈ పరిమితి విధించారు. తద్వారా, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు వీలుగా దీనిని తీసుకొచ్చారు. ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అప్పుడు ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ మీకు కరెంట్ ఖాతా ఉంటే, ఈ పరిమితి రూ. 50 లక్షలు. అయితే ఈ నగదుపై తక్షణ పన్ను విధించరు. ఈ పరిమితుల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలనేది రూల్.
సెక్షన్ 194ఏ అంటే ఏమిటి..
మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, దానిపై 2% టీడీఎస్ తీసివేస్తారు. గత మూడేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని వారిపై 2% టీడీఎస్ మినహాయింపు ఉంటుంది. అది కూడా రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే మాత్రమే ఇది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఈ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి విత్‌డ్రా చేస్తే, అప్పుడు 5% టీడీఎస్ కట్ అవుతుంది. సెక్షన్ 194ఎన్ కింద మినహాయింపు పొందిన టీడీఎస్ ఆదాయంగా వర్గీకరించలేదు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు క్రెడిట్‌గా ఉపయోగించవచ్చు.
సెక్షన్ 269ఎస్టీ అంటే ఏమిటి..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానిపై జరిమానా విధిస్తారు. అయితే, బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేయడంపై ఈ పెనాల్టీ వర్తించదు. అయితే, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ విత్‌డ్రాలపై టీడీఎస్ తగ్గింపు వర్తిస్తుంది.