UPI Overpayment Scam: స్కామ్‌ గురూ.. రూ. 200 పంపి.. రూ. 20,000 నొక్కేస్తారు! తస్మాత్‌ జాగ్రత్త

www.mannamweb.com


న దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. చిన్న వీధి వ్యాపారి నుంచి పెద్ద మాల్స్‌, స్టార్‌ హోటళ్ల వరకూ అన్ని చోట్ల యాక్సెసబులిటీ పెరిగింది. ఇది వినియోగదారుడికి భద్రతతో పాటు, సౌకర్యాన్ని కూడా అందిస్తుండటంతో అందరూ దీనిని వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలో వీటి సాయంతో మోసాలు చేసే వారు బయలుదేరుతున్నారు. వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తూ వారి కష్టార్జితాన్ని సులభంగా కొట్టేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, 2022-23లో 9,046 మోసాలతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపు మోసాల సంఖ్య 36,075కి పెరిగింది. కాగా ఇటీవల యూపీఐ ద్వారా చేస్తున్న ఓ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. అదే యూపీఐ ఓబర్‌ పేమెంట్‌ స్కామ్‌. ఈ స్కామ్‌ ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

యూపీఐ ఓవర్‌ పేమెంట్‌ స్కామ్‌..

మీరు ఆఫీసులో మంచి బిజిగా ఉన్నారనుకోండి. సరిగ్గా అదే సమయంలో ఓ అన్‌నోన్‌ కాల్‌ మీకు వస్తుంది. అవతలి వ్యక్తి ఆస్పత్రిలో ఉన్నానని.. వేరే వారికి పంపబోయి.. మీకు రూ. 20,000 పంపానని.. తిరిగి ఆ మొత్తాన్ని పంపాలని అభ్యర్థిస్తాడు. అతని కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నందున అతనికి వెంటనే అది తిరిగి కావాలని కోరతాడు. అంతేకాక అతను అప్పటికే మీ యూపీఐ యాప్‌లో డబ్బు సేకరణ అభ్యర్థనను కూడా సెండ్‌ చేసి ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా ఈ సేకరణ అభ్యర్థనపై నొక్కి, చెల్లింపును క్లియర్ చేయడమే. మీరు తర్వాత చేస్తానని చెప్పినా.. వినకుండా ప్రాధేయపడుతూ ఉంటాడు. కాల్ కట్ కూడా చేయనివ్వడు. తప్పు మొబైల్ నంబర్‌కు డబ్బు పంపడం చాలా సాధారణ తప్పు, మీరే చెప్పండి. కావాలంటే మీ ఫోన్‌ కి మేసేజ్‌ కూడా వచ్చి ఉంటుంది చూడండి అంటూ చెబుతాడు. ఒత్తిడిలో మీరు ఫోన్‌ చూస్తే.. నిజంగానే మెసేజ్‌ వచ్చి ఉంటుంది. అయితే దానిని సరిగ్గా చూసుకోకుండా.. అతను అడిగిన అమౌంట్‌ సెండ్‌ చేసేస్తారు. ఇక అంటే ఆ కాల్‌ కట్‌ అవుతుంది. ఆతర్వాత ఎప్పుడో ఖాళీ సమయంలో మీకు వచ్చిన మెసేజ్‌ను క్లిక్‌ చూస్తే.. లేదా మీ బ్యాంక్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసినా.. మీరు షాక్‌ తింటారు. మీకు కేవలం రూ. 200 మాత్రమే పంపి, మీ వద్ద నుంచి రూ. 20,000 కాజేశాడు. మీకు వచ్చిన మెసేజ్‌ చెక్‌ చేస్తే దానిలో ‘రూ. 200.00’ అని ఉంటుంది. కానీ పొరపాటున మీరు రూ. 20,000 అని చదివి, దాన్ని ధ్రువీకరించకుండానే తిరిగి ఇచ్చేశారు. దీంతో మోసపోయారు.

ఏం చేయాలి..

ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. అందుకే డబ్బులు పంపే విషయంలో ఏమాత్రం తొందరపడకూడదు. ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ధ్రువీకరించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే బ్యాంక్‌కి నివేదించాలి. యూపీఐ ప్రొవైడర్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ),సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయాలి.

ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేయండి.. ఏదైనా యూపీఐ అభ్యర్థనను ఆమోదించే ముందు, దాన్ని ఎవరు పంపుతున్నారు అనేది క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏదైనా ఊహించని చెల్లింపు అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండండి.

పంపినవారి వివరాలు తెలుసుకోండి.. మీరు తెలియని వారి నుంచి లేదా ఊహించని మొత్తం కోసం చెల్లింపు అభ్యర్థనను స్వీకరించినట్లయితే, కొనసాగే ముందు పంపినవారి వివరాలను కాల్ లేదా సందేశం ద్వారా ధ్రువీకరించండి.

ఎస్‌ఎంఎస్‌లపై జాగ్రత్త.. స్కామర్‌లు తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు క్లెయిమ్‌లతో అయాచిత సందేశాలను పంపుతారు. పంపినవారి గుర్తింపు, లావాదేవీ ఉద్దేశాన్ని ధ్రువీకరించకుండా ఏ అభ్యర్థులకు ప్రతిస్పందించవద్దు లేదా ఆమోదించవద్దు.

టెన్షన్ వద్దు.. ఫోన్ కాల్‌ల ఆధారంగా, ముఖ్యంగా తెలియని నంబర్‌ల ఆధారంగా డబ్బు బదిలీలలో ఎప్పుడూ తొందరపడకండి. గుర్తుంచుకోండి, స్కామర్లు దోపిడీ చేయడానికి తరచుగా అత్యవసర పరిస్థితిని, భావోద్వేగంతో కూడిన పరిస్థితిని ఉపయోగిస్తారు. అప్రమత్తంగా ఉండండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోండి.