ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు..
కోవిడ్ రకరకాల వేరియంట్స్ తో ఓ వైపు భయపెడుతుంటే.. మన దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మరో వైపు పెరుగుతున్నాయి. ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పుని మానవాళికి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా గత కొద్ది రోజుల్లోనే 15 మంది రోగులు మరణింనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వెస్ట్ నైల్ కొత్త వైరస్ కాదు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రోజు వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీనిని ఎలా నిరోధించవచ్చు? దీని గురించి నిపుణుల సలహా సూచనలు ఏమిటో తెలుసుకుందాం..
ఇజ్రాయెల్‌లో వెస్ట్ నైల్ వైరస్ కలకలం..
ఇజ్రాయెల్‌లోని అనేక నగరాల్లో వెస్ట్ నైలు జ్వరం వ్యాపిస్తోంది. మే నుంచి ఈ వైరస్ సోకిన రోగుల సంఖ్య 300 కి చేరుకుంది. 15 మంది రోగులు మృతి చెందగా, 20 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఈ ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే ..
యశోద హాస్పిటల్ కౌశాంబి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఛవీ గుప్తా మాట్లాడుతూ.. వెస్ట్ నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందన్నారు. ఈ వైరస్ సోకిన జంతువును దోమ కుట్టినప్పుడు, ఈ వైరస్ దోమ లోకి వెళ్తుంది. ఆ దోమలు మనుషులను కుట్టినప్పుడు వెస్ట్ నైల్ వైరస్ మనుషులకు సోకుతుంది. అటువంటి లక్షణాలు ఈ వైరస్ సంక్రమణ తర్వాత కనిపిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ వైరస్ కేసులు ప్రతి సంవత్సరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి. అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ అవసరం. ఈ జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ గుప్తా సూచించారు.
వెస్ట్ నైల్ వైరస్ వ్యాధి లక్షణాలు
- అధిక జ్వరం
- తీవ్రమైన తలనొప్పి
- బలహీనంగా అనిపించడం
- తీవ్రంగా కీళ్ళు, కండరాలలో నొప్పి
- చర్మంపై దద్దుర్లు
వెస్ట్ నైల్ వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే..
- దోమ కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేలా వాటినిఇంట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి
- పొడవు చేతులున్న దుస్తులు, కాళ్లు కూడా కవర్ అయ్యేలా పొడవైన ప్యాంటు ధరించాలి
- సాయంత్రం సమయంలో వీలైనంత వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు
- ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు
- కిటికీలు, తలుపులకు తెరలు ఏర్పాటు చేసుకోవాలి