ఫేస్ బుక్‎లో నకిలీ అకౌంట్.. అమ్మాయి పేరుతో పరిచయం.. కట్ చేస్తే..

www.mannamweb.com


ఫేస్ బుక్‎లో పరిచయం ఒక యువకుడి ప్రాణాలు తీసింది. అతని పేరు భాను ప్రకాష్.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వలస వచ్చాడు. అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన కొంతమందితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే గోవిందు అనే యువకుడితో భాను ప్రకాష్ స్నేహం చేయడం మొదలు పెట్టాడు. ఫేస్ బుక్ లో మౌనిక పేరుతో భాను ప్రకాష్ ఖాతా తెరిచాడు. ప్రెండ్ రిక్వెస్ట్ ద్వారా గోవిందుకు పరిచయం అయ్యాడు. గోవింద్ తరుచూ ఫేస్ బుక్‎లో ఉండటాన్ని గమనించే యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ ఖాతా ద్వారా గోవింద్‎తో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దీ కాలం తర్వాత అవసరం ఉందంటూ డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకుంటూ మొత్తం ముప్పై వేల వరకూ దోచేశాడు.

అయితే ఆ విషయం అప్పట్లో గోవిందుకు తెలియదు. కొద్ది రోజులు పోయిన తర్వాత తనను భాను ప్రకాష్ మోసం చేస్తున్నట్లు గోవిందుకు అర్ధం అయింది. అమ్మాయి పేరుతో ఖాతా తెరిచి తన వద్ద డబ్బులు తీసుకున్నది కూడా భాను ప్రకాష్ అని గోవిందు నిర్ధారణకు వచ్చాడు. ఇదే విషయంపై భానును నిలదీశాడు. అయితే తనకేమి తెలియదని మొదట బుకాయించినా.. చివరికి ఇద్దరి కామన్ ప్రెండ్స్ ద్వారా మోసం తెలిసిపోయింది. దీంతో గోవిందు భాను ప్రకాష్‎ను మందలించాడు. తన డబ్బులు తనకి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన భాను ప్రకాష్ రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం జిజిహెచ్‎లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై భాను ప్రకాష్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం చేసిన భాను ప్రకాష్‎పై బెదిరింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.