మన దేశంలోని చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా బ్యాంకులు సేవలను విస్తరించడంతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తెరుస్తున్నారు. మన సొమ్మును దొంగల బారిన పడకుండా బ్యాంకు ఖాతాలో ఉంచుకోవడం అనేది అనుకూలమైన మార్గంగా మారింది. అయితే ఇలా బ్యాంకు ఖాతాలో సొమ్ము ఉంచుకోవడం వల్ల ఆ మొత్తంపై కొంత వడ్డీని కూడా పొందుతారు. భారతీయ పౌరుడికి పొదుపు ఖాతాలను తెరిచేందుకు ఎలాంటి పరిమితి లేదు. అయితే ఓ బ్యాంకు అకౌంట్ ఎంత వరకూ సొమ్ము జమ చేయవచ్చనే విషయంలో సగటు వినియోగదారుడికి అనుమానంగా ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ రేటుతో పన్ను బాధ్యతల వల్ల కొంత మంది బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో సొమ్మును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడరు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఆదాయపు పన్ను శాఖ పన్ను విధిస్తుందా? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒకరు తమ సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని ఉంచాలి. అంటే అది జీరో బ్యాలెన్స్‌లో ఉండకూడదు. మీరు మీకు వీలైనంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు. అయితే సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్స్‌పై ఎలాంటి పరిమితి లేదు. కానీ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌కు తెలియజేస్తుంది. ఇదే నియమం నగదు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్‌లలో పెట్టుబడులు వంటి ఇతర రకాల ఫైనాన్సింగ్‌లకు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం లేదా బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి పరిమితి లేదు. ఇంకా సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తం ద్వారా వచ్చే వడ్డీపై బ్యాంక్ ఖాతాదారుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ వడ్డీపై బ్యాంక్ 10 శాతం టీడీఎస్ తీసేస్తుంది వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ పన్ను మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం పౌరులు తమ పన్ను మొత్తాలను రూ.10,000 వరకు రాయితీ పొందవచ్చు. వడ్డీ మొత్తం రూ. 10,000 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తికి పన్ను విధించరు. అలాగే ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్లు దాటి ఉంటే రూ. 50,000 వరకు వడ్డీపై వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ జమ అయితే దాని మూలం గురించి అడిగే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు సరైన సమాచారం ఇవ్వకపోతే ఆ మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌చార్జి, 4 శాతం సెస్ విధిస్తారు.