రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు ఇక గట్టిపోటీ

www.mannamweb.com


భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో పీఎంవీ స్టార్టప్ ఈవీ కారును రిలీజ్ చేసింది. కేవలం రూ.4 లక్షలకే ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ముంబైకి చెందిన స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ (పీఎంవీ ఎలక్ట్రిక్) దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. పీఎంవీ ఈఏఎస్-ఈ పేరుతో లాంచ్ చేసిన ఈ ఈవీ కారు మైక్రో ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పీఎంవీ ఈవీ ధర దాదాపు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ ఈ-కారు పొడవు 2915 మిమీ మాత్రమే ఉంటుంది. ఈ ఈవీ కారును రూ. 2000 చిన్న మొత్తంతో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును 15 ఏఎంపీ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. ఈ కారును కేవలం దాదాపు 4 గంటల్లో పూర్తిగా చేయవచ్చు.

పీఎంవీ ఈవీ కారు మార్కెట్‌లో ఉన్న కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారు టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కంటే తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ కారును కంపెనీ దీనిని 2022లో ప్రవేశ పెట్టినా డెలివరీ తేదీల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అధికారికంగా పేర్కొనలేదు. అయితే ఈ కారు అందుబాటులోకి వస్తే మాత్రం టాప్ కంపెనీల ఈవీ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.