శ్వేతపత్రాల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు.. పార్టీల మధ్య కొనసాగుతోన్న యుద్ధం

www.mannamweb.com


‘ఏపీలో ఇసుక, రాళ్లు, గనులు సహా సర్వం దోచేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారంటూ’ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగుతోంది.

గత ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో పెద్ద తిక మక ఉందంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తోంది. ఈ వైట్ పేపర్ల చుట్టూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైట్స్‌ నడుస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని టీడీపీ అంటోంది. కానీ అవి శ్వేతపత్రాలు కాదు జెలసీ పత్రాలని వైసీపీ అంటోంది. మొత్తంగా ఏపీలో వైసీపీ, టీటీడీ నేతల మధ్య శ్వేత యుద్ధమే నడుస్తోంది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి.. గత ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగింది ఇదే.. ప్రస్తుతం ఇదీ ఏపీ పరిస్థితి అంటూ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తోంది. ఒక్కో అంశం మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై మొదట వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేసిన బాబు.. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అలాగే బాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అమరావతిపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అమరావతి గత ఐదేళ్లుగా ఎలా నిర్లక్ష్యానికి గురైందో వివరిస్తూనే అమరావతి పునరవైభవానికి కేంద్ర సహకారం గురించి తెలియచేశారు. వీటితో పాటు విద్యుత్, సహజవనరుల దోపిడీ పైనా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలియచేసే ఉద్దేశంతోనే తాను రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నా అంటున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర స్థితిగతులను పరిశీలించే కొద్దీ ప్రతి రంగంలోనూ ఎన్నెన్నో అవకతవకలు బయటపడుతున్నాయని, ఏ శాఖను చూసినా ఘోరమైన పరిస్థితులే ఉన్నాయని సీఎం వివరించారు. అధికారంలో ఉన్నాం కదా అన్ని ఎన్నో తప్పులు, తప్పుడు నిర్ణయాలు జరిగాయి. భూములు, ఇసుక, అడవులు, క్వారీలు.. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత దోపిడీకి వైసీపీ పాల్పడిందనేది చంద్రబాబు వైట్ పేపర్ల సారాంశం.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహంకారంగా వ్యవహరించారని, చివరకు సహజ వనరులను సైతం వదలకుండా దోచేసుకున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా నాలుగు శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇంకా మరికొన్ని అంశాలపైనా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తామని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చబెడతామంటున్నారు. ఈ శ్వేతపత్రాలే కాదు. టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవమే అంటోంది వైసీపీ. ఎన్నికల్లో ప్రజలకు అలవిగాని హామీలిచ్చి.. వాటిని అమలుచేయలేక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పథకాలు ఎలా అమలు చేయాలి.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాన్ని పక్కనబెట్టి తమపై బురదజల్లడమే ఎన్డీఏ సర్కార్ పనిగా పెట్టుకుందనేది వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న వాదన.

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టే ఆలోచనలో ఉంది చంద్రబాబు సర్కార్. అయితే శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఇన్ని ఆరోపణలు చేస్తున్న టీడీపీ.. ఏ ఒక్క అధికారి గానీ లేదంటే మంత్రి గానీ తప్పుచేసినట్టు తేల్చారా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. దానికి టీడీపీ సైతం ధీటుగానే బదులిస్తోంది. ఇక బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలోనూ పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్‌నే తీసుకొచ్చే ఆలోచనలో కూటమి సర్కార్ ఉంది. దీన్ని కూడా వైసీపీ తప్పుబడుతోంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో చిత్తశుద్ది ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. అలా చేయడం లేదంటే ఏమిటి దానికి అర్థం అని ప్రశ్నిస్తోంది.

వైసీపీ రివర్స్‌ కౌంటర్‌..

దోపిడీ జరిగింది. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడమే కానీ.. ఎవరు తిన్నారు, ప్రభుత్వ ఆదాయానికి ఎవరు గండికొట్టారో చంద్రబాబు చెప్పగలరా అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పేదల కోసం పనిచేసిన తమకు అవినీతి మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే తొందరపడితే ఎలా అంటోంది టీడీపీ. త్వరలోనే అన్నీ బయటకి వస్తాయ్.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది. మొత్తంగా శ్వేతపత్రాల పేరుతో వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుంటే.. వైసీపీ నేతలు దీనిని తప్పుబడుతున్నారు. ఈ రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.