దేవాదాయశాఖలో.. ‘శాంతి’ లీలలు!

నిబంధనలకు విరుద్ధంగా లీజులు నివేదికలు పంపిన జిల్లా అధికారులు


ఈనాడు, విశాఖపట్నం: దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌ కె.శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

వైకాపా పాలనలో ఆమె హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాదాయశాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. ఆమెకు మొదటి పోస్టింగు విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్‌ 24 నుంచి 2022 జూన్‌ 30 వరకు సహాయ కమిషనర్‌గా చేశారు.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమెపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికలో విస్తుపోయే అంశాలున్నాయి.

అప్పట్లో జరిగిన ఉల్లంఘనలపై దేవాదాయశాఖ కమిషనరుకు జిల్లా శాఖ నుంచి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్‌రోడ్డులో సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్‌ రెస్ట్‌ హౌస్, పాయకరావుపేటలో పాడురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినోళ్లకు కట్టబెట్టారు.

సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్‌ పుష్పవర్థన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతని మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది.
లంకెలపాలెం వద్ద దేవాదాయశాఖకు చెందిన స్థలాన్ని.. ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.

దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసేవారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది.
నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
గతంలో ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనరుగా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశమైంది. తరువాత విచారణలో ఇది నిజమని తేల్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.