పెద్దవాగుకు గండి.. ముంచుకొచ్చిన ఉపద్రవం.. నీటమునిగిన పలు గ్రామాలు

www.mannamweb.com


రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిపడ్డ వరద ఊళ్లకు ఊళ్లని చుట్టుముట్టింది.

భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్లమీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. బాధితులు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. ముంపు భయంతో ఇళ్లపైకి చేరిన నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారు. ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది.

పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు.. మొత్తం 20 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు మేకలు కొట్టుకు పోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు నేల కొరిగి వరదలో కలిసి పోయాయి. ఎన్నో ఆశలతో సాగుచేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

పెద్దవాగు వరద లోతట్టు ప్రాంతాలవైపు మళ్లడంతో ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది. మామూలుగా అయితే పెద్దవాగు నిండితే నేరుగా వెళ్లి బంగాళా ఖాతంలో కలుస్తుంది. కానీ ప్రాజెక్ట్‌కు గండి పడటంతో వేలేరుపాడు మండలం మొత్తం నీటమునిగింది. అనేక గ్రామాలపై వరద ప్రభావం పడింది. ఇళ్లతో పాటు వేలాది ఎకరాలు నీటమునిగాయి. ఈ గ్రామాల్లో వరదబాధితులంతా గుట్టలపై తలదాచుకుంటున్నారు. అదే పెద్దవాగు వరద జల్లేరుతో పాటు అలివేరు, బైనేరుకు పోటెత్తింది. జల్లేరు రిజర్వాయర్‌కి మామూలుగా వచ్చే వరదతో పాటు పెద్దవాగు నుంచి ఒక్కసారిగా వరద రావడంతో ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల్లేరు మీదుగా అదే పెద్దవాగు వరద ఎర్రకాలువకూ భారీగా వస్తోంది. ఎర్రకాలువ నుంచి యనమదుర్రు అడిక్వేట్‌కి వరద పోటేత్తింది. అంతిమంగా ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది.

ఇది రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గండి పూడ్చేందుకు రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.