సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ఆశలను, అవసరాలను ఆసరగా చేసుకొని ప్రజల డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు.
ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి నేరాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటుగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు.
మారిన కాలంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రుణాలు పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇంట్లో కూర్చొనే మొబైల్ యాప్‌లో ఒక చిన్న క్లిక్ ద్వారా లోన్ పొందే అవకాశం లభించింది. దీన్నే ఆసరగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇంతకీ ఈ స్కామ్ ఎలా జరుగుతుంది..? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా లోన్ కావాలనుకునే వారు ఏదో ఒక వెబ్సైట్లో తమ ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకుంటారు. దీంతో పలు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ లభించింది అంటూ మెసేజ్‌లు వస్తాయి. అందలోనే ఒక లింక్‌ను కూడా ఇస్తారు. ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లోన్ పొందొచ్చనేది సదరు మెసేజ్ సారాంశం. ఇక లింక్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ వంటి వ్యక్తిగత వివరాలు అడుగుతారు.
ఒకవేళ పొరపాటున ఆ మెసేజ్‌ను నమ్మి అన్ని వివరాలు ఎంటర్ చేశారో ఇక మీ పని అంతే. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని కనుక వారు తెలిపిన విధంగా ఎంటర్ చేస్తే. మీ ఖాతాలోని డబ్బులన్నీ అవతలి వారి ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. పర్సనల్ లోన్ పేరుతో జరుగుతోన్న ఈ మోసం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పేరున్న బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్‌లకే స్పందించాలి. ముఖ్యంగా ఊరుపేరు లేని బ్యాంకుల నుంచి ప్రీ అప్రూవ్డ్ పేరుతో వచ్చే మెసేజ్‌ల జోలికి వెళ్లకపోవడమే బెటర్. అలాగే ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని ఎంటర్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.