కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వైకాపా నేత అండదండలతో అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన అవినీతి తీరుపై కలెక్టర్, ఇంటర్మీడియట్ ఆర్జేడీకి ఫిర్యాదులు వెళ్లాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆర్జేడీ నుంచి ఆదేశాలొచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు శూన్యమే. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం గత ఏప్రిల్‌లో చేపట్టారు. మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఇన్విజిలేటర్లకు సహాయకులుగా (బాయ్స్) 60 మంది విధులు నిర్వహించారు. వీరుకాక అదనంగా మరో 16 మంది వివరాలు నమోదు చేసి రూ.90 వేలకుపైగా బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నిధులు సదరు ఉన్నతాధికారికి అనుకూలంగా ఉన్న సిబ్బంది ఖాతాలో జమ చేసి డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఆర్‌ఐవో కార్యాలయంలో కార్ డ్రైవర్‌కు చెందినవారు కావడం గమనార్హం.
ఇతర ఖాతాల్లోకి మళ్లింపు
- పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల తరలింపులో భాగంగా వాహనాలకు చెల్లించాల్సిన రూ.3 వేల అద్దెను పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో ఖర్చు చేయించినట్లు సమాచారం. అద్దె సొమ్ము ప్రభుత్వం ఇచ్చినప్పటికీ పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వకుండా సదరు అధికారి నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.1.20 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర ఇంటర్ బోర్డు దృష్టికి వెళ్లింది.
- పరీక్ష సమయంలో అవసరమయ్యే స్టేషనరీ (జిరాక్సులు)కిగాను ఆర్‌ఐవో కార్యాలయ సమీపంలో ఉన్న ఓ పుస్తక దుకాణంలో నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.50 వేలు బయటి వ్యక్తి ఖాతాకు మళ్లించారన్న అనుమానాలున్నాయి.
- పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే జిరాక్సులను నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో చేయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన జిరాక్సు బిల్లు మొత్తం రూ.36,540కు ఎలాంటి తేదీలు లేకుండా పెట్టారు. ఈ మొత్తాన్ని సైతం అనామత్ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది.
- ‘‘ఇంటర్ పబ్లిక్ పరీక్షల విషయంలో ఆర్‌ఐవోకు పూర్తి బాధ్యతలుంటాయి. ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్రంగా విచారణ చేయించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని’’ కడప ఆర్జేడీ ఎస్.రవినాయక్ తెలిపారు.