ఏపీలో పథకాల అమలు పైన చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ బిడ్డకు రూ 15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.
ఈ పథకం అమలు విషయం లోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక బిడ్డకే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందనే వార్తలు వినిపించాయి. ఈ పథకం అమలు..లబ్దిదారుల ఖరారు గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. కీలక అంశాలను వెల్లడించారు.
పథకం అమలుపై
తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అందరికీ రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు పైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్దిదారుల ఆధార్ కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో, ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అందరికీ అందిస్తాం
ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకం అమలు గురించి క్లారిటీ ఇచ్చారు. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ 15 వేలు చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేసారు. ఎలాంటి కోతలు లేకుండా రూ 15 వేలు ఇస్తామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతీ విద్యార్ధికి అమలు చేస్తామని చెప్పారు. తల్లి తంద్రులు, మేధావులతోనూ చర్చలు చేసిన తరువాత విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
వ్యతిరేకం కాదు
ఇక, ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేసారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. మూడో తరగతి నుండి ,పదవ తరగతి వరకు ,విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ,పరీక్షలు వల్ల పిల్లల పై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నారు. టోఫెల్ శిక్షణ లో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వ హించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. నాడు నేడు లో ,పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.