అక్కడ వారం రోజులు విద్యాసంస్థలకు సెలవులు.

www.mannamweb.com


ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా చాలా వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముసురు కొనసాగుతోంది. మరో మూడ్రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరీ.. పరిస్థితి తీవ్రంగా ఉన్న దగ్గర విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఒక ప్రాంతంలో మాత్రం వర్షాలతో సంబంధం లేకుండా వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అందుకు బలమైన కారణమే ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకునే సెలవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోని విద్యా సంస్థలకు ఈ సెలవులు ప్రకటించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపారు. అయితే అది కూడా హరిద్వార్ లోని అందరికీ కూడా కాదు. కన్వర్ యాత్ర ఏ రూట్లో అయితే జరుగుతుందో ఆ మార్గంలో ఉండే అంగన్ వాడీలు, స్కూల్స్, కాలేజెస్ అన్నింటికి జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు సెలవులు ప్రకటించారు. ఈ కన్వర్ యాత్ర కోసం ఎక్కడెక్కడి నుంచో శివ భక్తులు వివిధ మార్గాల్లో హరిద్వార్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్కువ రద్దీ, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా మార్గాల్లో ఉండే విద్యా సంస్థలకు వారంపాటు సెలవులు ప్రకటించారు.
కన్వర్ యాత్ర అంటే?:

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఈ కన్వర్ యాత్ర ఏటా జరుగుతుంది. దేశంలోని నలుమూలల నుంచి శివ భక్తులు శ్రావణ మాసంలో హరిద్వార్ చేరుకుంటారు. అక్కడికి వాళ్లు అందంగా అలంకరించిన బిందెలను తెస్తారు. వాటిలో ప్రవిత్ర గంగా జలాన్ని నింపుకుంటారు. ఆ తర్వాత కావిళ్లతో గానీ.. వాహనాల్లో గానీ ఆ జలాన్ని తీసుకెళ్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే శివలయాల్లో ఆ నీళ్లతో అంభిషేకం చేస్తారు. వారి స్వగ్రామం కావచ్చు, లేదంటే ప్రసిద్ధి శివాలయంలో కావచ్చు ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ యాత్రలో అత్యధిక భక్తులు కావిళ్లతో కాలినడకనే వెళ్తారు. ఈ యాత్రకు ఎంతో చరిత్ర కూడా ఉంది. దీనిని ఎంతో పవిత్రమైన ప్రక్రియగా భావిస్తారు.