ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. డిపాజిట్లపై అత్యధిక లాభం.. దేంట్లో ఎంతో లిస్ట్ ఇదే.

www.mannamweb.com


Bank FD Rates: ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపై 20 బేసిస్ పాయింట్ల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అత్యధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తూ ఎస్‌బీఐ అమృత్ వృష్టి అనే పథకం లాంఛ్ చేసింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అధిక వడ్డీ రేటుతో కూడిన బీఓబీ మాన్సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇతర ప్రముఖ దిగ్గజ బ్యాంకులు కొన్ని కూడా గత నెల్లోనే వడ్డీ రేట్లను సవరించడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంకుల్లో డిపాజిట్ వడ్డీ రేట్లను పోల్చుకొని చూద్దాం.

>> వడ్డీ రేట్లను పెంచిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 55 నెలలు లేదా నాలుగేళ్ల 7 నెలల డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.40 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.90 శాతం వడ్డీ అందుతుంది. జులై 24 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
>> ఎస్‌బీఐ కొత్త స్కీమ్ అమృత్ వృష్టిని 444 రోజుల టెన్యూర్‌తో ప్రవేశపెట్టింది. దీని కింద రెగ్యులర్ సిటిజెన్లకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీం జులై 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

>> ఐసీఐసీఐ బ్యాంకులో 15 నుంచి 18 నెలల డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.20 శాతం, సీనియర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. జులై 25 నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి.
>> యాక్సిస్ బ్యాంకులో చూస్తే 17-18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.20 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. జులై 1 నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి.

>> పంజాబ్ నేషనల్ బ్యాంకులో 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. జూన్ 10 నుంచి ఇది అమల్లో ఉంది.
>> బ్యాంక్ ఆఫ్ బరోడాలో 399 రోజుల మాన్సూన్ స్పెషల్ డిపాజిట్‌పై అత్యధికంగా వరుసగా 7.25 శాతం, 7.75 శాతం వడ్డీ అందుతుంది. జులై 15 నుంచి ఇది వర్తిస్తుంది.