పులస పుట్టుక ఎంత విచిత్రమైనదో.. దాని రుచి అంత అమోఘం

www.mannamweb.com


అరిసెలు, బూరెలు, వడలు, ఆవడ బొండలు, గజ్జికాయలు, కరకారలాడే జంతికలు, కమ్మని పులిహోర, గొంగూర ఇవన్నీ మన ఆంధ్రస్పెషల్ వంటకాలు.. ఇంతేనా అనుకునేరు.. ఇంతకుమించి ఇంకెన్నెన్నో ఉన్నాయి. అలాంటి రుచికరమైన, ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి మాత్రం బాగా ఫేమస్‌ అండోయ్‌.! దాని పేరు చెబితే చాలు.. మాంసం ప్రియులకు నోరూరుతుంది. ఏడాదికి రెండు నెలలు మాత్రమే దొరికే ఆ వంటకం అంటే.. తెలుగు రాష్ట్రాల్లో భోజనప్రియులకు ఫుల్లు క్రేజ్‌.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ వంట రుచి, వాసన తెలిసిన ప్రపంచ వ్యాప్త భోజన ప్రియులకు ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. ఇక ఆంధ్ర అల్లుళ్లకిచ్చే మర్యాద గురించి అయితే, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సీజన్‌ వచ్చిందంటే.. అల్లుడికి తప్పనిసరిగా ఆ వంట రుచి చూపిస్తారు. అబ్బా.. ఏంటి మీ సుత్తి..ఏదో వంటకం అంటూ తెగ నాన్చేస్తున్నారు.. అని విసుక్కుంటున్నారా..? ఆ వంటకం మరేంటో కాదండోయ్‌..పులస..

పుస్తెలమ్మి అయినా సరే.. పులస తినాల్సిందే..! అన్న మాట మనం చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.. కానీ, మనలాంటి వాళ్లం ఎన్నడూ చూసింది లేదు..నానుడి మాత్రం బాగానే ఫేమస్‌..అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండేది. ఉన్నంతలో బంగారమే కాస్ట్లీ కాబట్టి పుస్తెలమ్మీ అనే మాట వచ్చిందనుకుంటా.. కానీ, నేటి పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పులస నానుడికి అర్థాన్ని మార్చేశాయి పుత్తడి ధరలు.. కానీ, ఆ నాటి నానుడికి తగ్గటుగానే, ఇప్పటికీ పులస ధర వేలల్లో పలుకుతోంది. డిమాండ్‌ను బట్టి చేప ఖరీదు రూ.10000 నుంచి రూ.40000 వరకు ఉంటుంది. ఒక్కసారి ఈ పులస పులుసు తిన్నవారు జీవితంలో మర్చిపోలేరట. ఇకపోతే, ధరకు తగ్గట్టుగానే ఆ చేప టేస్టు కూడా అదే రేంజ్‌లో ఉంటుందట.. అందుకనే వీటిని కొనడానికి జనాలు ఎగబడుతుంటారు. పులస పడిందా.. ఆ మత్స్యకారుడి పంట పండినట్లే..! ధర అంత ఎక్కువ మరి..! చేపలందు పులస చేప రుచే వేరండి అంటారు ఉభయగోదావరి జిల్లాల్లోని భోజన ప్రియులు. వర్షాకాలంలో దొరికే ఈ చేపను తినేందుకు నాన్‌ వెజ్‌ప్రియులు ఎగబడుతుంటారు.

పులస పులసు తింటే.. ఆ కిక్కే వేరప్పా.!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి నెలకొంటుంది. పులస కొనేందుకు, తినేందుకు మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా వెనుకాడరు.. అంత క్రేజ్ ఉన్న పులసలు భారతదేశంలో ఒక్క గోదావరి జిల్లాలకే సొంతం. కేవలం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ చేపలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక, ఆ సీజన్‌లో పులసలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. కానీ దీని ధరలు మాత్రం సామాన్యులకు అందని ద్రాక్ష అనే చెప్పాలి. చేపల్లో పులసలకే ఈ ప్రత్యేకత ఎందుకు.? అని మనలాంటి చాలా మందికి సందేహం కలగొచ్చు. కానీ, గోదారోళ్లను టచ్‌ చేస్తే మత్రం..ఆ కిక్కే వేరప్పా.! అంటున్నారు. పులస తినని జన్మ ఎందుకురా అన్నట్టుగా తీసి పారేస్తున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పులస చేపను బెండకాయలు కొత్తిమీరతో కలిపి వండుతారట. దీంతో పులస రుచి మరింత అమోఘంగా ఉంటుందని చెబుతారు.

గోదావరి పరిసర ప్రాంతవాసులు పులస చేపలను తమ బంధువులకు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి వండి పంపించటం కూడా చేస్తుంటారు. ఈ పులస ఎంత ప్రత్యేకం అంటే.. రాజకీయ నాయకులు, బడా బడా వ్యాపారస్తులను కలవడానికి వెళ్లినప్పుడు పులస పులుసును, చేపను బహుమతిగా ఇస్తే దాదాపు మన పని అయిపోయినట్లే అని చెబుతుంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావుకు తూర్పు గోదావరి ప్రాంతం నుండి ప్రతి యేట పులస చేపల కూర పంపించటం ఇక్కడ ఆనవాయితీగా ఉండేదట. ప్రస్తుతం పలువురు రాజకీయ నాయకులు తమ తమ అధినాయకులకు పులస చేప వంటల రుచి చూపిస్తుంటారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పులస ఎంత ఫేమస్సో. ఒకప్పుడు పులస చేపను కూడా చాలా సాధారణ చేపగానే చూసే వారు. కానీ, ఇప్పుడు పులస దొరికిందంటే వేలం పాట వేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి అరుదైన రుచి వుంటుందట. పులస పులుసు రుచి వెనుక పెద్ద స్టోరీయే ఉందంటున్నారు గోదారొళ్లు.. అదేంటో మనం తప్పక తెలుసుకోవాల్సిందే..!

పులస పుట్టుక వెనుక చిత్రమైన రహస్యం ఇదేనట..!

పులస.. గోదావరి నదిలో మాత్రమే లభించే చేప. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది..అక్కడ దీనిని ‘హిల్సా అని పిలుస్తారు. ‘హిల్సా ఇలీషా’ అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. ఫసిఫిక్ మహా సముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీషా అనే పేరు గల ఈ వలస జాతి చేపలు.. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి గోదావరిలోకి చేరుతాయి. వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే విలస చేపలు.. గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ వశిష్ట, వైనతేయ నదీపాయల గుండా ప్రయాణిస్తూ.. వరద నీటి నురుగును తింటూ జీవిస్తుంది. అంటే, సముద్రంలో సంచరించే ఈ చేప, వర్షాకాలంలో నదుల్లోకి వస్తుంది. కొత్త నీరు.. అంటే, ఎర్ర నీరు కదా.! ఆ ఎర్ర నీరులో సంచరించే పులస, ఆ నీటి ప్రభావంతో కొత్త రుచిని సంతరించుకుంటుందని పులస ప్రేమికులు చెబుతుంటారు. సముద్రంలో ఇది లభించినా ‘విలస’ చేప అని మళ్ళీ నీళ్లలోనే వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి గోదావరి నీటిలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ చేపను పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు. కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా అంతుకుమించి పోటీ పడతారు.

ఎర్ర నీటిలో ఎదురీదుతూ వచ్చిన విలస రూపాంతరం చెంది..

గోదావరి ఎర్ర నీటిలో ఎదురీదుతూ ఉండటం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి.. ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుందని చెబుతారు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత పులసలు మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకూ నదిలో ఎదురీదుతుంది. విలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక.. దాని శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది. సంతానోత్పత్తి చేశాక, తిరిగి సముద్రంలోకి చేరి.. విలసగా రూపాంతరం చెందుతుంది.

పులస దక్కాలంటే అదృష్టం ఉండాలట..!

పులసలు అంత తెలిగ్గా దొరకవంటున్నారు మత్స్యకారులు.. గేలానికి, వలాకి అంత తేలిగ్గా పడవట. ఇందుకోసం ఎంతో శ్రమించి ఏటి మధ్యకు వెళ్లి వలను ఏర్పాటు చేసుకుంటారు మత్స్యకారులు. ఇక్కడ కూడా వీటిని పట్టేందుకు ప్రత్యేకమైన వలను ఏర్పాటు చేస్తారట.. ఇంత కష్టపడినా పులస చిక్కుతుందనే గ్యారెంటీ లేదు. అయినా ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు తమ ప్రయత్నం తాము చేస్తుంటారు. మిగిలిన చేపలతో పోలిస్తే.. వీటి రక్తప్రసరణ వేగంగా ఉంటుదట… అందుకే వలలో పడగానే చనిపోతాయి.. కానీ, రెండు రోజుల వరకు పాడవకుండా ఉండటమే పులసల ప్రత్యేకత అని మత్య్యకారులు, పులస ప్రియులు చెబుతున్నారు. ఇక, పులసకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు వినియోగదారులను మోసం చేస్తుంటారు. పులస పేరుతో నమ్మిన వారికి ఎక్కువ ధరలకు విలస చేపను అంటగట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అలా పులస పేరుతో మోసపోకుండా ఉండేందుకు.. వాటిని ఎలా గుర్తుపట్టాలో తెలిస్తే చాలంటున్నారు మత్స్యకారులు.. సముద్రంలో లభించే విలసలు తెలపురంగులో ఉంటాయని, గోదావరిలో దొరికే పులస చేపలు సగం తెలుపు.. సగం గోధుమ రంగులో ఉంటాయని చెబుతున్నారు. ఇక, పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటుందని, మిగిలిన ఏ చేపకు వలయాకారాలు ఉండవంటున్నారు.

పులసను ఎలా గుర్తించాలో తెలుసా..

ఒడిశా, ముంబై, విశాఖ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్‌ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్‌లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పుస్తెలు అమ్మి అయినా ఏడాదికి ఒక్కసారి పులస కూర తినాలనే నానుడి ఉన్న కోనసీమ వాసులు ఎంత ధరయినా వెనకాడకుండా పులసలు కొని తృప్తిగా ఆరగిస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్ర నీరు ఉన్నంత వరకూ మాత్రమే దొరికే అవకాశం ఉండటంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్న వారు విలస బారిన పడి మోసపోకుండా ఉండాలంటున్నారు. అసలైన పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగూ లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. చల్లదనం అసలే ఉండదు. చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది.ఇక, పులసకు మరో ప్రత్యేకత కూడా ఉందట..గ్యాస్ స్టవ్‌ల మీద వండితే పులసలకు ఏ మాత్రం రుచి ఉండదని, వీటిని కట్టెల పొయ్యి మీద మాత్రమే.. నేర్పుగా వండాలంటున్నారు గోదారోళ్లు. ఇందుకోసం ప్రత్యేకించి చింత పుల్లలనే వంటచెరుకుగా వినియోగిస్తారట. పులస పుట్టుక, పులుస కథ మామూలుగా లేదు కదా..!

పసిడితో పాటు పరుగులు పెడుతున్న పులస..

ప్రతి ఏటా గోదావరి నదిలో పులస చేపలు ఎక్కువ సంఖ్యలో దొరికేవని చెబుతున్నారు మత్స్యకారులు. ప్రతి సీజన్‌లో సుమారు మూడు నుంచి నాలుగు టన్నుల పులస చేపలు చిక్కేవి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మహా చిక్కితే వంద నుంచి రెండు క్వింటాళ్లు మాత్రమే దొరికే అవకాశముంది. దీంతో పులస చేప ధర అమాంతం పెరిగిపోయింది. ఒకప్పటి నానుడిని నిజం చేస్తూ పులస ధరలు బంగారంతో పోటీ పడుతుందా అనే సందేహం కలిగిస్తోంది. అందుకే పులస ప్రియుల మధ్య పోటీ ఎక్కువైంది. సీజన్‌ దాటిందంటే మళ్లీ ఏడాది దాకా ఆగాల్సి వస్తుందనే నిరాశతో వారంతా ముందుగానే మత్స్యకారులకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే..పులసను దక్కించుకోవాలనుకుంటున్నారు. కనీసం ఒక్క పులస నైనా వండించుకు తినాలని పులస ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ సంవత్సరం ఆ అదృష్టం ఎందరిని వరిస్తుందో చూడాలి మరీ.!

కాగా ఈ సీజన్‌లో తొలి పులస వేలంలో రూ.24 వేల ధర పలికింది. కోనసీమ జిల్లా వశిష్ట గోదావరిలో ఓ జాలరికి కేజీన్నర బరువు కలిగిన పులస చిక్కింది. వేలంలో దీన్ని రూ.24 వేలకు విక్రయించాడు.