రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం

www.mannamweb.com


ఏపీ అసెంబ్లీ నిరవదికంగా వాయిదా పడింది. మొత్తం అయిదు రోజుల పాటూ నిర్వహించిన సమావేశాల్లో భాగంగా అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ నోటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయన్నారు. గతంలో రూ. 200 పెన్షన్ రూ. 2000కు పెంచామని చెప్పారు. ఈసారి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పాం.. ఇస్తున్నామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెల రూ. 7 వేల పెన్షన్ అందించామని గుర్తుచేశారు. కరెంట్ కొరత నుంచి మిగులు కరెంటు సాధించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి నీటిని తరలించామన్నారు. తనకు పేరు వస్తుందని గత ప్రభుత్వం పట్టిసీమను ఆపరేట్ చేయలేదని ఆరోపించారు.

అమరావతి విషయంలో గతపాలకులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా 34,400 ఎకరాలు సేకరించామని గుర్తు చేశారు. ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 3 ఏళ్లలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పోలవరం ఖర్చు పెరిగిందని చెప్పారు. తాము ఎప్పుడూ సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. అక్రమ ఇసుక మైనింగ్‌తో రాష్ట్రానికి రూ. 7 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. విద్యుత్ రంగంలో రూ. 1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లని వెల్లడించారు. ఇంకా మొత్తం వివరాలు రావాల్సి ఉందన్నారు. ఇప్పుడు తలసరి అప్పు రూ. 1.44 లక్షలు అయితే తలసరి ఆదాయం రూ. 74 వేలు అని చెప్పారు. తలసరి ఆదాయం తగ్గి అప్పు పెరిగిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. విశాఖలోని పలు ఆస్తులను తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వ భూముల తాకట్టుతో రూ. 1940 కోట్లు సేకరించారన్నారు. ఆ తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి ప్రసంగంపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ఇంతటితో ముగియడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.