ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబరు 30న నోటీసు.. నవంబరు 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నవంబరు 23న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు.
ఆ తర్వాత నవంబరు 9 వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబరు 30న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.వచ్చే ఏడాది మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు , ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. అలాగే ఈ నెల 29న తూర్పు-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు నోటీసు జారీ చేస్తారు. సెప్టెంబరు 3 వరకూ దరఖాస్తులు స్వీకరించి..నవంబరు 6న తుది జాబితా ప్రచురిస్తారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో.. వారంతా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ నమోదు చేయడం అనేది ఓటరు ఇష్టమని క్లారిటీ ఇచ్చారు. మార్చిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని తెలిపారు.
గతేడాది మార్చిలో కూడా గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం.. ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. ఇటు ఉత్తరాంధ్ర పట్టుభద్రుల నియోజకవర్గం ఎన్నికలు జరిగాయి. మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.