శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ఇండియన్ టీమ్ కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ లంక బౌలర్లను బెంబేలెత్తించాడు. టీమ్ పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే అతడు కేవలం 26 బంతుల్లో 58 రన్స్ చేయడంతో తొలి టీ20లో టీమిండియా 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.
పంత్ 49, యశస్వి 40 పరుగులు చేశారు. శ్రీలంక గడ్డపై ఓ టీ20లో ఇండియన్ టీమ్ కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో బంగ్లాదేశ్ పై 176 రన్స్ చేసింది.
చుక్కలు చూపించిన సూర్య
రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైరైన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్ పై ఏమాత్రం ఉండదని ముందే చెప్పాడు. చెప్పినట్లే శ్రీలంకతో జరిగిన తొలి టీ20లోనే చెలరేగాడు. ఆ టీమ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 58 రన్స్ చేయడం విశేషం.
74 పరుగుల దగ్గర యశస్వి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అప్పటికే యశస్వి, గిల్ బాదుడుతో ఢీలా పడిన లంక బౌలర్లు.. సూర్య ధాటికి తట్టుకోలేకపోయారు. తనదైన స్టైల్లో గ్రౌండ్ నలుమూలలా ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అందులో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ ఫోర్ కొట్టిన సూర్య.. 58 పరుగుల దగ్గర పతిరన బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. డీఆర్ఎస్ తీసుకున్నా.. రీప్లేల్లోనూ అతడు ఔటని తేలింది.
యశస్వి విశ్వరూపం
సూర్య కంటే ముందు యశస్వి.. తర్వాత రిషబ్ పంత్ చెలరేగారు. ముఖ్యంగా యశస్వి తనదైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అతడు కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. అటు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. దీంతో ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లే 6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. పవర్ ప్లే చివరి బంతికి గిల్ ఔటయ్యాడు.
ఆ వెంటనే మరుసటి ఓవర్ తొలి బంతికే యశస్వి కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో సూర్య, పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఓవైపు సూర్య చెలరేగితే.. మరోవైపు పంత్ మొదట్లో నెమ్మదిగా ఆడాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. సూర్య ఔటైన తర్వాత పంత్ తన బ్యాట్ కు పని చెప్పాడు. అతడు 33 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఔటయ్యాడు.
శ్రీలంక బౌలర్లలో పతిరన 4 వికెట్లు తీసినా.. అతడు 4 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చాడు. మరో బౌలర్ అసిత ఫెర్నాండో 4 ఓవర్లలోనే 47 పరుగులు, మధుశంక 3 ఓవర్లలోనే 45 పరుగులు ఇవ్వడం విశేషం.