శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ కార్డు) అనేది దేశంలోని పౌరులందరికీ అత్యంతం అవసరం. మన ఆర్థిక లావాదేవీలకు చాలా ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది.
పన్ను చెల్లించేవారందరూ దీనిమీదుగా లావాదేవీలు జరుపుతారు. దేశ పౌరుడిగా ఆధార కార్డు ఎలాంటి గుర్తింపునిస్తుందో, పాన్ కార్డు మన ఆర్థిక లావాదేవీలను తెలియజేస్తుంది. పాన్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక మైన సంఖ్యలను కేటాయిస్తారు. అయితే మన పాన్ కార్డుతో కొందరు అనధికార కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఆన్ లైన్ లో పాన్ కార్డు వివరాలు నమోదు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ తమ పాన్ కార్డు లావాదేవీలపై అవగాహన ఉండాలి.
దుర్వినియోగమైతే అనర్థాలు..
మన పాన్ కార్డును వేరొకరు తమ కార్యకలాపాలకు అనధికారికంగా ఉపయోగించడాన్నే పాన్ కార్డు స్కామ్ అంటారు. దీనివల్ల మనకు అనేక అనర్థాలు జరుగుతాయి. నేర ప్రయోజనాలు, దొంగతనాలు, ఆర్థిక నేరాల కోసం ఉపయోగిస్తే చట్టపరమైన చిక్కులకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో పాన్ కార్డు స్కామ్ లు జరుగుతున్నాయి. పాన్ కార్డును మోసపూరిత రుణ దరఖాస్తులు, అక్రమ కార్యకలాపాల కోసం బ్యాంక్ ఖాతాలను తెరవడం, ఎస్ ఎమ్ఎస్ ద్వారా ఫిషింగ్ స్కామ్‌లు, సెలబ్రిటీల పేర్లతో క్రెడిట్ కార్డులను పొందడం వంటి వాటి కోసం నేరగాళ్లు ఉపయోగిస్తున్నారని తెలిసింది. వీటి వల్ల తీవ్రమైన కష్టాలను, నష్టాలను, చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాలి. ఇలాంటి వాటిని గుర్తిస్తే ఏమి చేయాలి, ఆదాయపు పన్ను శాఖకు ఎలా తెలియజేయాలో తెలుసుకుందాం.
మోసాన్ని అధికారులకు తెలపాలి..
పాన్ కార్డు దుర్వినియోగమైతై, జరిగిన మోసాన్ని వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలి. దానికోసం ఆన్ లైన్ ఈ పద్దతులను అనుసరించాలి.
ముందుగా పన్ను సమాచార నెట్‌వర్క్ పోర్టల్‌ని సందర్శించాలి.
కస్టమర్ కేర్ విభాగానికి వెళ్లి, ఫిర్యాదులు/ప్రశ్నలు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఫిర్యాదు ఫారమ్‌ను పూర్తిచేసి, సమస్యను వివరించాలి. క్యాప్చాను నమోదు చేసి, సమర్పించండి.
తనిఖీ చేయండి..
మీ పాన్ కార్డు ద్వారా ఎవ్వరైనా మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్నారా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. దానికోసం ఆన్ లైన్ లో ఇలా సులువుగా తనిఖీ చేసుకోవచ్చు.
క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్ లోకి వెళ్లి, మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి.
మీ పాన్ కార్డు వివరాలను నమోదు చేయండి, మీ ఫోన్‌కు పంపిన ఓటీపీని ధృవీకరించండి.
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం జరిగితే మీ క్రెడిట్ స్కోర్ దాన్ని సూచిస్తుంది.
జాగ్రత్తలు ఇవే..
పాన్ కార్డ్ మోసాలను గురికాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
యూఆర్ఎల్ ‘https’తో ప్రారంభమైన వెబ్ సైట్ లలో మాత్రమే మీ పాన్ నంబర్‌ను నమోదు చేయాలి.
అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయకండి.
మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. అలాగే ఆర్థిక నివేదికలను కూడా సమీక్షించాలి.
మీ పాన్ కార్డుకు లింక్ చేయబడిన లావాదేవీల వివరాలను తెలుసుకోవడానికి ఫారమ్ 26ఏఎస్ ను తనిఖీ చేయండి.
అప్రమత్తంగా ఉండడం, పైన తెలిపిన విధంగా నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా పాన్ కార్డ్‌ను మోసం నుంచి రక్షించుకోవచ్చు.