Dogs Meat: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో నమ్మ లేని నిజాలు

www.mannamweb.com


Dogs Meat: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో నమ్మ లేని నిజాలు

బెంగళూరులో హోటల్స్కు వెళ్లి తినేవాళ్లలో, తిన్న వాళ్లలో కొత్త భయం మొదలైంది. ముఖ్యంగా మటన్ మండీలు, మటన్ బిర్యానీలు తినే వాళ్లలో కుక్క మాంసం వార్తలతో టెన్షన్ పట్టుకుంది.

మీమర్స్ హాస్యాన్ని పండించేందుకు ఈ పరిణామంపై మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. కానీ.. విషయం అంత సిల్లీ మేటర్ కాదు. బెంగళూరులో బయటికెళ్లి మటన్ బిర్యానీలు తిన్న వాళ్లలో ఈ పరిణామం గుబులు రేపుతోంది. నెట్టింట ఈ కుక్క మాంసం వార్తలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో కర్నాటక ప్రభుత్వం కూడా స్పందించింది. శుక్రవారం రాత్రి ఈ మాంసాన్ని సీజ్ చేసినట్లు, ఫుడ్ ల్యాబొరేటరీకి మాంసం శాంపిల్స్ను పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుక్క మాంసం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేసేందుకే రాజస్థాన్ నుంచి మాంసం వ్యాపారులు ఈ మాంసాన్ని తెప్పించినట్లు సమాచారం. అయితే.. ఇది కుక్క మాంసమా, కాదా అనే విషయం శాంపిల్స్ పరిశీలించి, నిర్ధారించాకే తేలనుంది. అయితే ఈలోపే అది కుక్క మాంసమే అని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. జైపూర్-మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 150 కార్టన్లలో అబ్దుల్ రజాక్ అనే మాంసం వ్యాపారికి చెందిన రెడ్ మీట్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది మేక, గొర్రె మాంసమే అని సదరు మాంసం వ్యాపారి చెబుతున్నప్పటికీ కుక్క మాంసం అనే అనుమానాలు, ప్రచారం జోరుగా జరిగింది. దీంతో.. వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపారు. 150 కార్టన్లలో దాదాపు 4,500 కిలోల మీట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాదిగా బెంగళూరులోని మెజారిటీ మటన్ షాపుల్లో కిలో మటన్ రూ.700కు పైగానే అమ్ముతున్నారు. కానీ.. ట్రైన్లో దొరికిన మాంసం బాక్సులు ఎవరివని తేలిందో, ఆ మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్తో పాటు కొందరు మటన్ షాపు వ్యాపారులు కిలో మటన్ను 400 రూపాయలకే అమ్ముతున్నట్లు తేలింది. అందువల్లే.. తోటి మాంసం వ్యాపారులు అబ్దుల్ రజాక్ అమ్ముతోంది మటన్ కాదని భావిస్తున్నారు. మటన్ అమ్మడానికి తాను లైసెన్స్ తీసుకున్నానని, గుట్టుచప్పుడు వ్యాపారం చేయడం లేదని అబ్దుల్ రజాక్ చెబుతున్నాడు. బెంగళూరు ట్రైన్లో కలకలం రేపిన ఆ 4,500 కిలోల మాంసం… కుక్క మాంసమో, కాదో తెలియాలంటే 14 రోజుల్లో వచ్చే ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ బయటకు రావాల్సిందే. అది కుక్క మాంసమో.. కాదో పక్కనపెడితే ఈ ఘటన మాత్రం బెంగళూరులో మాంసం సప్లై చైన్ తీగ లాగేందుకు కారణమైంది. ప్రతీ వారం రాజస్థాన్ నుంచి 12 వేల కిలోల మటన్ బెంగళూరుకు సప్లై అవుతోందని మాంసం వ్యాపారులు తెలిపారు. ఆ మాంసాన్ని శుభ్రం చేసి.. చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి బెంగళూరు సిటీలోని రెస్టారెంట్లకు, హోటల్స్కు, మటన్ షాపులకు సప్లై చేస్తుంటారని తెలిసింది.