కాశ్మీర్ పేరు చెబితే ఎవరికైనా గుర్తుకొచ్చేది చుట్టూ హిమాలయాలు, మధ్యలో విశాలమైన లోయలో చల్లని ఆహ్లాదకర వాతావరణం. భారతీయ సినీ పరిశ్రమకు, దేశ విదేశీ పర్యాటకులకు కాశ్మీరు లోయ ఒక స్వర్గధామం. “కాశ్మీరు లోయలో.. కన్యాకుమారిలో”, “అందాలలో అహో మహోదయం.. భూలోకమే నవోదయం” అంటూ సాగిన యుగళ గీతాలు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. చలికాలంలో మంచు దుప్పటి కప్పుకుని తెల్లగా మెరిసిపోయే ఈ లోయ, మిగతా కాలాల్లోనూ చల్లదనంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. అందుకే జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి వేసవి రాజధానిగా నేటికీ కొనసాగుతోంది. దేశమంతటా వేసవిలో ఎండ వేడి, ఉక్కపోత భరించలేని చాలామంది తమ స్తోమతకు తగ్గట్టు కాశ్మీర్ లోయలో సేదతీరుతూ ఉంటారు. అలాంటి చల్లని కాశ్మీరం ఇప్పుడు గరం గరంగా మారింది. అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులతోనో.. లేక స్థానికంగా కాశ్మీర్ ప్రజలు చేస్తున్న ఆందోళనలతో కాదు. వాతావరణంలోనే మార్పులు కాశ్మీర్ లోయను వేడిగా మార్చేశాయి. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యాయి. ఈ లోయలో నమోదైన ఉష్ణోగ్రతల్లో 3వ అత్యధిక ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు జులై 28న (ఆదివారం) నమోదైంది.
1999 జులై 9న శ్రీనగర్‌లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆ తర్వాత దాదాపు ఆ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత 1946 జులై 10 ఇక్కడ అత్యధికంగా 38.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే కాశ్మీర్ లోయ చరిత్రలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 1999, తాజాగా మళ్లీ ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్ మాత్రమే కాదు, ఖాజీగుండ్, కోకర్‌నాగ్ వంటి ప్రాంతాల్లో సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది జులై కాశ్మీర్ లోయలో వేడి నెలగా రికార్డుల్లోకి ఎక్కింది. శ్రీనగర్‌లో జులై నెలలో సాధారణంగా నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది 5.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ లెక్కగట్టింది. కోకర్‌నాగ్‌లో ఏకంగా 7.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయలో ఎయిర్ కండిషనర్(AC)లను వినియోగించాల్సిన అవసరం ఉండదు. చలికాలంలో గదిని వేడిగా ఉంచడం కోసం హీటర్లు మాత్రం తప్పనిసరి. అందుకే హోటల్ గదులను అద్దెకు ఇచ్చేవాళ్లు.. ఏసీ రూమ్, నాన్-ఏసీ రూమ్ అనే వ్యత్యాసానికి బదులుగా, హీటర్ రూమ్, నాన్-హీటర్ రూమ్‌గా వ్యవహరిస్తుంటారు. కానీ ఇలా గరిష్టంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే చల్లని కాశ్మీర్ లోయలో కూడా ఏసీలను వాడాల్సిన రోజులు వస్తాయోమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ.. పాఠశాలల్లో ఏసీలను అమర్చాల్సిన స్థాయిలో లేవని తెలిపారు.
శ్రీనగర్ కంటే జమ్ము కూల్!
జమ్ము-కాశ్మీర్ భౌగోళిక స్వరూపం గమనిస్తే.. జమ్ము హిమాలయాలకు దిగువన ఉంటుంది. జమ్ము దాటిన తర్వాతనే హిమాలయ పర్వత శ్రేణులు ప్రారంభమవుతాయి. అంటే హిమాలయ పాదాల వద్ద జమ్ము ఉంటే, హిమాలయాల మధ్యలో ఏర్పడ్డ కాశ్మీర్ లోయలో శ్రీనగర్ ఉంటుంది. అందుకే శ్రీనగర్ ఎప్పుడూ జమ్ము కంటే చల్లగా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో హిమాలయాలకు ఆనుకున్న డెహ్రాడూన్, చండీగఢ్ వంటి నగరాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు కాస్త అటూఇటుగా జమ్ములో నమోదవుతుంటాయి. శ్రీనగర్‌లో వాతావరణం మాత్రం వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ 2024 జులై 28 (ఆదివారం) నాడు ఈ రెండు నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. జమ్ములో 35.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. శ్రీనగర్‌లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే జమ్ము కంటే శ్రీనగర్ వేడిగా ఉంది. సాధారణంగా ఇలా ఎప్పుడూ జరగదు. ఏ కాలంలోనైనా శ్రీనగర్ కంటే జమ్ములోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ అందుకు భిన్నంగా చల్లగా ఉండాల్సిన వేసవి రాజధానిలో వేడి ఎక్కువగా ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేసిన జులై నెల పోతూ పోతూ శ్రీనగర్‌కు వర్షాన్ని మోసుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తద్వారా వాతావరణం చల్లబడుతుందని వివరిస్తున్నారు. కాశ్మీర్ డివిజన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, జమ్ము డివిజన్‌లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి డా. ముఖ్తార్ అహ్మద్ వెల్లడించారు. ఈ తరహా పరిస్థితి జులై 29 నుంచి 31 వరకు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 01 నుంచి 04 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురియవచ్చని చెప్పారు.