పారిస్ వీధుల్లో రామ్‌చరణ్‌, పీవీ సింధు సందడి – సోషల్‌ మీడియాలో ట్రెండింగ్

www.mannamweb.com


పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓవైపు అథ్లెట్లు సత్తా చాటుతుంటే మరోవైపు సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. విశ్వ క్రీడల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పడు అప్‌డేట్స్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు(PV Sindhu.. పారిస్‌ వీధుల్లో కలిసి తిరగడం సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. తొలి మ్యాచ్‌కు ముందు పీవీ సింధు.. రామ్‌చరణ్‌తో మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతుల చేతుల్లో ఉండే రైమ్‌ అనే కుక్క పిల్లను సింధు ముద్దు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దేశం కాని దేశంలో ఇద్దరు దిగ్గజాలు కలిసి మాట్లాడుకోవడం చాలామందిని ఆనందపరిచింది. ఈ అపురూప సన్నివేశం చాలామందిని ఆకట్టుకుంది. ఈ ఊహించని సమావేశం చాలా మంది హృదయాలను దోచుకుంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో రామ్‌చరణ్‌తో సింధు మాట్లాడుతూ కనిపించారు. రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్‌ గురించి సింధు అడుగుతూ కనిపించారు. సింధు ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె భవిష్యత్తులో ఆడే అన్ని మ్యాచులను గెలవాలని రైమ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్‌లో సింధుతో కలిసి ఉన్న ఫొటోను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఉపాసన కూడా తమ ఒలింపిక్ అనుభవాన్ని షేర్ చేశారు. రామ్ చరణ్, పీవీ సింధు, రైమ్‌ల మధ్య సంతోషకరమైన క్షణాలు భారత్‌లో క్రీడలు- సినిమాలకు ఉన్న స్నేహపూర్వక బంధానికి నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు.

పారిస్‌లో మెగా కుటుంబం
మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం పారిస్‌లో సందడి చేస్తోంది. న్యూయార్క్‌లో కొన్ని రోజులు హాలీడేస్‌ ఎంజాయ్‌ చేసిన చిరు కుటుంబం అటు నుంచి అటే పారిస్‌ చేరుకుంది. ఒలింపిక్‌ వేడుకల్లో పాల్గొంది. చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు పారిస్‌లోని చారిత్రక ప్రదేశాలు చూస్తూ హాలీ డేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే పారిస్‌లోని చారిత్రాత్మకమైన ప్రదేశాలను మెగా కుటుంబం వీక్షించింది. వీరి రాకతో విశ్వ క్రీడలకు సెలబ్రిటీ గ్లామర్‌ వచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో తమ కుటుంబ సందడిని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫోటోలు, వీడియోలను ఇన్‌ స్టాలో అప్‌లోడ్‌ చేశారు. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని… భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సురేఖతో కలిసి ఫోటోను పోస్ట్ చేశారు.

సింధు తొలి విజయం
పారిస్‌ ఒలింపిక్స్‌లో సింధు తొలి విజయం నమోదు చేసింది. మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై అద్భుతమైన విజయంతో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయం సాధించింది.