రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలని, గత ప్రభుత్వంలో మాదిరిగా వ్యక్తులు ఫొటోలు, పార్టీ రంగులు ఉండకూదని సీఎం చంద్రబాబు సూచించారు.
రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చర్చించారు. గత ఐదేళ్ల పాలనలో తీసుకు వచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై, తీసుకోవలసిన చర్యలపై పలు అంశాలు చర్చకు వచ్చాయి. మదనపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలను వివరించారు. పట్టాదారు పాసు పుస్తకాల అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అధికారులు తాము సూచించిన పట్టాదారు పుస్తకాల నమూనాను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై సీఎం కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. పాసు పుస్తకం చూడగానే రైతుల్లో భరోసా కలగాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. భూ ఆకమ్రణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉండాలి అన్నారు.
5న కలెక్టర్ల కాన్ఫరెన్స్
వచ్చే నెల ఐదో తేదీన సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఐఏఎస్, ఐసీఎస్‌లను బదిలీ చేసింది. బదిలీల తర్వాత జరిగే ఈ తొలి సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.