ఆగస్టు 1 టెన్షన్ – జీతాలు, పెన్షన్ల కష్టాలు..ఏం జరుగుతోంది..!!

www.mannamweb.com


ఏపీలో అర్దిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది. ప్రతీ నెలా 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు..పెన్షన్లతో పాటుగా 67 లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతీ నెలా 1వ తేదీనే అందించాల్సి ఉంది.

దీంతో, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలంలో ప్రతీ మంగళవారం రెండు లేదా మూడు వేల కోట్లు సమీకరిస్తోంది. ఇక, మరో మూడు రోజుల్లో ఒకటో తేదీ వస్తుండటంతో మళ్లీ ఆందోళన కనిపిస్తోంది.

ఆర్దిక కష్టాలతో

ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతీ నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లను మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దనే అందించేంది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల్లో వైసీపీకి ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో, చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి ఏడు వేల కోట్లు ఖజానాలో ఉండటంతో జూలై1 చెల్లింపులకు ఇబ్బంది కాలేదు.

ఆగస్టు 1 చెల్లింపులు

రూ 4 వేలకు పెరిగిన పెన్షన్ తో పాటుగా మూడు నెలల బకాయిలు…ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు తొలి జూలై 1,2 తేదీల్లో జమ చేసారు. ఆ సమయంలో ఆర్బీఐ నుంచి కొంత మొత్తం రుణం సేకరించారు. ఇక, రేపు (మంగళవారం) ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయాల రుణ సేకరణకు ఇండెంట్ పెట్టింది. ఆగస్టు 1న ఉద్యోగుల వేతనాలు, సామాజిక పెన్షన్ల కోసం ముందు నుంచే నిధులను సమీకరించా ల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక పెన్షన్లు నాలుగు వేలతో పాటుగా పెన్షన్ల అన్ని కేటగిరీల మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది.

ఆర్బీఐ నుంచి రుణం

ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం దాదాపు రూ 5 వేల కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని.. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. అయితే, ప్రతీ నెలా ఇదే రకంగా 1వ తేదీ టెన్షన్ మరి కొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా లేదు.