తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ.. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే

www.mannamweb.com


తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేశారు జిష్ణుదేవ్‌ వర్మ. రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగోవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్‌ వర్మ… తెలంగాణ రాష్ట్రానికి నాలుగవ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌ వేదికగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే.. జిష్ణుదేవ్‌ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

అంతకుముందు హైదరాబాద్‌ చేరుకున్న గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అధికారులతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గవర్నర్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్‌. అనంతరం పలువురు కిషన్‌ రెడ్డి సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఇక 1957 ఆగస్టు 15న త్రిపురలోని రాజకుటుంబంలో జన్మించారు జిష్ణుదేవ్‌ వర్మ. రామ జన్మభూమి ఉద్యమ సమయం1990లో ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. త్రిపుర ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన సేవలందించారు. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. అంతేకాదు బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేశారు జిష్ణుదేవ్‌ వర్మ. ఇక గత సంవత్సరం జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. తాజాగా బీజేపీ నేతృత్వం లోని కేంద్ర సర్కారు గవర్నర్‌ పదవిని కట్టబెట్టింది.