ఆరోగ్యశ్రీపై ఏపీలో రాజకీయ చర్చ.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

www.mannamweb.com


ఏపీలో ఆరోగ్యశ్రీపై సరికొత్త చర్చ మొదలైంది. వైఎస్సార్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని మాజీమంత్రి విడదల రజిని ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని అనడం సరికాదన్నారు రజిని. గతంలో చంద్రబాబు సర్కార్ పెట్టిన బకాయిలను తాము క్లియర్ చేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. అప్పులు, బకాయిల పేరుతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతుందా అన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. చంద్రబాబు మనసులో ఉన్న మాటనే టీడీపీ నేతలు చెబుతున్నారా అని ప్రశ్నించారు.

విడదల రజినీ కామెంట్లకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రజలు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై చర్చ మొదలైంది. కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కార్డును అందరూ తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్డుల ద్వారా అయిదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవచ్చన్నారు. పెమ్మసాని కామెంట్స్‌పై వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యింది. దీంతో ఈ అంశంపై రాజకీయ రగడ మొదలైంది.