మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అన్న సామెత వర్తక, వాణిజ్య సంస్థలకు కూడా చెందుతుంది. మార్కెట్ లో ఒక తరహా పరిశ్రమలు ఎక్కువైతే లాభాలు కూడా తక్కువ అవుతాయి.
దీంతో ఆ సంస్థ తన ఖర్చులను అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. అటువంటి సమయంలో తమ అభివృద్ధి కోసం అంత వరకూ రాత్రనక పగలనక కష్టపడిన ఉద్యోగస్తులను కూడా తొలగించాలనే నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు కూడా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పిన సంఘటలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. మార్కెట్‌లో ఎన్వీడియా, ఎఎమ్‌డి, క్వాల్‌కామ్ వంటి ప్రత్యర్థి కంపెనీలతో గట్టి పోటీ పెరిగిన వేళ తమ సంస్థ వ్యయం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. అది కూడా 20 బిలియన్ డాలర్ల ఖర్చుని తగ్గించుకోనున్నామని ప్రకటించింది. తమ సంస్థలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తగ్గించుకోనున్నామని ప్రకటించి ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చింది.
అగ్రరాజ్యం అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ.. తమ సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 15 శాతం తగ్గించుకోనున్నామని ప్రకటించింది. ఇటీవల ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇంటెల్ సంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్లను నష్టపోయింది. ఈ నేపధ్యంలో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి సంస్థ నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్లను తగ్గించుకోనున్నామని వెల్లడించింది. అందుకనే కంపెనీలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగస్తులను తొలగించనున్నట్లు చెప్పారు.
ఇంటెల్ కంపెనీ చేస్తున్న ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకుందని.. అయినా రెండవ త్రైమాసికంలో కూడా ఆర్థిక పనితీరు ఆశించినట్లు లేదని ఇంటెల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ చెప్పారు. ఇక నుంచి కంపెనీ పరిస్థితి మరింత సవాళ్లతో సాగనుందని వెల్లడించారు.
ఇంటెల్ కంపెనీలో 2023 ఏడాది చివరి నాటికి 1, 24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు సంస్థలో పని చేస్తున్న 15 శాతం మంది ఉద్యోగస్తులను తొలగిస్తే దాదాపు 18,000 మంది ఉద్యోగాస్తులపై ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు.
జూన్‌లో ఇంటెల్ ఇజ్రాయెల్‌లో ఒక ప్రధాన ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ విస్తరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది చిప్ ప్లాంట్‌కి అదనంగా $15 బిలియన్లను పంపింగ్ చేయబోతోంది. ఇంటెల్ ఆ సమయంలో భారీ స్థాయి ప్రాజెక్ట్‌లను నిర్వహించడం.. ముఖ్యంగా మా పరిశ్రమలో, తరచుగా మారుతున్న కాలక్రమాలకు అనుగుణంగా ఉంటుంది” అని చెప్పింది.
ఇంటెల్ ఆధిపత్యానికి గండి కొట్టిన పత్యర్ధి కంపెనీ
కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచ వ్యాప్తంగా ల్యాప్‌టాప్‌ల నుంచి డేటా సెంటర్‌ల వరకు ఇంటెల్ కంపెనీ ఆధిపత్యం చెలాయించింది. అయితే గత కొంతకాలంగా ఇతర కంపెనీలతో ఇంటెల్ కు పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఇంటెల్ కంపెనీ కృత్రిమ మేధస్సు సాంకేతికతల మీద (ఏఐ ప్రాసెసర్) ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియాతో గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.