శ్రీశైలంలో చంద్రబాబు పర్యటన.. కృష్ణమ్మకు జలహారతి

www.mannamweb.com


సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వెళ్లారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఫరూక్, గొట్టిపాటి, ఎంపీ శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి.. సీఎంకు స్వాగతం పలికారు. మల్లన్న ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు. అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు.

మడకశిర మండలం గుండుమల గ్రామానికి చెందిన రామన్నకు స్వయంగా పెన్షన్ అందించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రామన్న కుమారులు కాళ్లు మొక్కగా.. చంద్రబాబు వద్దని వారించారు. మీరు కాళ్లు మొక్కితే నేను కూడా అదే పని చేయాల్సి ఉంటుందని సున్నితంగా తిరస్కరించారు. గుండుమల గ్రామమంతా కలియతిరిగారు చంద్రబాబు. బాగున్నారా అని మహిళలను ఆప్యాయంగా పలకరించారు. మల్బరీ రైతు రంగనాథ్ తోటతో పాటు మల్బరీ పంటను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచుతామన్నారు చంద్రబాబు. సీమలో కరువు లేకుండా చేయడమే తమ సంకల్పమన్నారు. ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతుండగా పదే పదే వర్షం పడింది. అయినా ప్రజలెవరూ వెళ్లిపోకుండా ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారు.