నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు

www.mannamweb.com


అమరావతిలో (Amaravati) మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రానికి ఐఐటీ నిపుణులు రానున్నారు. ఈరోజు అమరావతికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ ఇంజినీర్ల బృందాలు అమరావతిలో పర్యటించనున్నారు. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్‌ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్‌ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు పరిశీలించనున్నారు. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించి పునాదుల సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌కు అప్పగించగా… ఐఏఎస్‌ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్‌ ఐఐటీకి అప్పగించింది. ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ హైదరాబాద్‌‌ల నుంచి ఇద్దరు చొప్పున ఇంజినీర్ల బృందాలు అమరావతికి రానున్నాయి. వీరు రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి.

అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయం…

మరోవైపు ఈరోజు సీఆర్డీయే అధారిటీ 36వ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. అధారిటీ చైర్మన్‌గా ఉన్న సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే సచివాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, సివిల్ సప్లై శాఖలపై ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష చేయనున్నారు. సంబంధిత శాఖ మంత్రులు గమ్మిడి సంధ్యారాణి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆయా సమీక్షలకు హాజరుకానున్నారు.