విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం.. సాగర నగరాన్ని వేడెక్కిస్తోంది. తమ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్సను విపక్ష వైసీపీ ఖరారు చేసింది. అయితే అధికార ఎన్డీయే కూటమి నుంచి బొత్సను ఢీ కొట్టేదెవరు?
అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవడంతో, పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు 30న జరుగుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఐతే.. మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది.
వైసీపీదే బలం..!
ఈ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైసీపీ బలం 615 కాగా, టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. ఇక 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ కంటే మూడురెట్ల సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. అయితే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి టీడీపీ, జనసేనల్లో చేరారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే, కూటమి అభ్యర్థిని దీటుగా ఎదుర్కోగలరని భావించి, ఆయనను బరిలో దింపింది వైసీపీ అధిష్టానం. ముందుగా మాజీ మంత్రి అమర్‌నాథ్ పేరు అనుకున్నా చివరికి బొత్స పేరు ఖరారు చేశారు.
రేసులో గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్
ఇక ఎన్డీయే కూటమి తరఫున టీడీపీ నేత గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న బాబ్జీ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే బాబ్జీకి సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేసులో రెండో స్థానంలో ఉన్న సీతంరాజు సుధాకర్ గతంలో వైసీపీలో పనిచేశారు. అప్పట్లో వైసీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూడా దిగారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. విశాఖ సౌత్ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు.
ఇక అనకాపల్లి నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన పీలా గోవింద్ పేరు కూడా వినపడుతోంది. ఆయన కూడా కూటమి పొత్తులో తన సీటును త్యాగం చేశారు. ఇక సీనియర్ నేత దాడి వీరభద్రరావు, మైనారిటీ నేత నజీర్‌లు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే బొత్స లాంటి సీనియర్‌ను ఢీ కొట్టాలంటే గండి బాబ్జీకే సాధ్యమని టీడీపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో…కూటమి తరఫున విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.