కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా

www.mannamweb.com


కప్పు కాఫీ తాగనిది రోజు మొదలు పెట్టని వారు మనలో చాలా మందే ఉంటారు. కాఫీ తగకపోతే రోజు గడవని వారు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కాఫీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని, అదే సమయంలో నష్టాలు కూడా ఉన్నాయనే చర్చ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు కాఫీ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నాయి.

ముఖ్యంగా కాఫీ తీసుకోవడం వల్ల ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుందని, జీవక్రియ మెరుగవుతుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా కాఫీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, హృదయ స్పందన పెరగడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఒక కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కాఫీలో కెఫిన్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది మెదడుతో పాటు నాడీ వ్యవస్థను ఉత్తేజపరుతుంది. ఇది మిమ్మల్ని అప్రమత్తంగా మారుస్తుంది. అందుకే వాహనాలు నడిపే సమయాల్లో నిద్ర వస్తున్నట్లు అనిపించగానే డ్రైవర్లు కాఫీ లేదా టీ తాగుతుంటారు. కాఫీ శరీరంలో అలసటను దూరం చేసి, శక్తి స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. అలాగే కెఫిన్‌ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్‌ చేయడంలో కాఫీ ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇక కెఫిన్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో డోపమైన్‌ స్థాయి పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి వాటిని దూరం చేయడంలో డోపమైన్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిరుత్సాహంలో ఉన్న వారు ఒక కప్పు కాఫీ తాగితే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. వ్యాయామం చేసే ముందు ఒక కప్పు కాఫీ తాగడం ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇక కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోసిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.