Sheikh Hasina: అందనంత ఎత్తుకు ఎదిగి.. అనూహ్యంగా పదవీచ్యుతురాలై!

www.mannamweb.com


Sheikh Hasina: అందనంత ఎత్తుకు ఎదిగి.. అనూహ్యంగా పదవీచ్యుతురాలై!

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో షేక్‌ హసీనాది చెరగని పాత్ర. ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయులుగా మార్చేసి.. ‘ఉక్కు మహిళ’ అంటూ మద్దతుదారులతో ప్రశంసలందుకున్నారు. అలాంటి హసీనా- తాజాగా అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి వైదొలిగి, దేశం వీడారు!

తల్లిదండ్రులను కోల్పోయి..
బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ కుమార్తె హసీనా. 1947 సెప్టెంబరులో ఆమె జన్మించారు. 1960ల చివర్లో ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. 1971లో పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం సిద్ధించింది. హసీనా తండ్రి దేశాధ్యక్షుడిగా, తర్వాత ప్రధానిగా కూడా పనిచేశారు. 1975 ఆగస్టులో ముజిబుర్, ఆయన భార్య, ఆ దంపతుల ముగ్గురు కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటికి ముజిబుర్‌ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా, ఆమె చెల్లి షేక్‌ రెహానా మాత్రమే. తమ ఇంట్లో హత్యాకాండ చోటుచేసుకున్నరోజు విదేశాల్లో ఉండటంతో వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు.

భారత్‌లో ఆరేళ్లు
తల్లిదండ్రులు, సోదరులు హత్యకు గురయ్యాక హసీనా బంగ్లాదేశ్‌ను వీడారు. ఆరేళ్లపాటు భారత్‌లో ప్రవాస జీవితం గడిపారు. తండ్రి స్థాపించిన అవామీలీగ్‌ అధినాయకురాలిగా ఎన్నికయ్యాక 1981లో స్వదేశానికి తిరిగొచ్చారు. అప్పటికి సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం గళమెత్తారు. ఫలితంగా పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1991 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని అవామీలీగ్‌ సాధించలేకపోయింది.

తిరుగులేని నేతగా ఎదిగి..
1996 ఎన్నికల్లో అవామీలీగ్‌ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠమెక్కారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి పదవి కోల్పోయారు. అయితే 2008 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరుగే లేకుండాపోయింది. అప్పటినుంచీ దేశంలో ఆమెదే అప్రతిహత పాలన! 1971 నాటి యుద్ధనేరాలపై హసీనా ఓ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేశారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్‌ దోషులుగా తేల్చింది. ఫలితంగా హింస చోటుచేసుకుంది. బీఎన్‌పీ కీలక మిత్రపక్షమైన జమాత్‌-ఎ-ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించారు. మరోవైపు- అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2014 ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసిన బీఎన్‌పీ.. 2018లో తిరిగి బరిలో దిగింది. ఆ రెండుసార్లూ విజయం అవామీలీగ్‌నే వరించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బాయ్‌కాట్‌ చేశాయి. హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

నియంత అంటూ విమర్శలు
హసీనాపై విమర్శలూ తక్కువేం కాదు. రాజకీయ ప్రత్యర్థులు ఆమెను నియంతగా అభివర్ణిస్తుంటారు. ఆమె పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అనేకసార్లు విమర్శలు గుప్పించారు. హసీనా భర్త అణు శాస్త్రవేత్త. ఆయన 2009లో మరణించారు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. అత్యధిక కాలం ఓ దేశానికి ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా పేరుగాంచారు.

కోటా తెచ్చిన తంటా
1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో పోరాడినవారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్‌ పునరుద్ధరణ జరగడం ప్రస్తుతం హసీనా కొంపముంచింది! అవామీలీగ్‌ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్‌ ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కారు అంగీకరించింది. తాజాగా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు.