జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర లెక్కలను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపైనే 8వేల 263 కోట్ల జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.
జీఎస్టీ వసూళ్లపై లోక్‌సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ తొలగించాలని కొద్దిరోజుల కిందట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారు. దీంతో వాటిని తొలగించాలని పలు విజ్ఞప్తులు వచ్చినట్లు వెల్లడించారు పంకజ్ చౌధరి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో పేదలు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, జన ఆరోగ్య బీమా పాలసీ, నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి పలు రకాల బీమా పాలసీ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు చెప్పారు చౌధరి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 8వేల 262.94 కోట్లు, 2022-23 ఆర్ధిక ఏడాదిలో 7వేల 638 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5వేల 354 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్‌పై GST రూపంలో వచ్చినట్లు చెప్పారు మంత్రి. జీఎస్టీ తొలగింపుపై కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా తర్వాతి ఆరోగ్య బీమాకు డిమాండ్ విపరీతంగా పెరిగడంతో ప్రజలు ఎక్కువగా పాలసీలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే దానిపై జీఎస్టీని తొలగించాలనే డిమాండ్లు కూడా పెరిగాయి.