Nara Lokesh: ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలి

www.mannamweb.com


Nara Lokesh: ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలి

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వంద మందికిపైగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించాలని మంత్రి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మైనర్‌ మాధ్యమ విద్యార్థులకు ఆంగ్లంతోపాటు వారి మాతృభాషపైనా పట్టు సాధించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలి. పాఠశాలల్లో సైన్సు ప్రయోగ సామగ్రి ఏర్పాటు చేయాలి. విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలి. కేజీబీవీల్లో బోధన పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి’ అని సూచించారు.

మరుగుదొడ్ల ఫొటోలు తీసే పని లేదు
పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యతల నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయులను తప్పించింది. ‘‘ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్‌ యాప్‌ నుంచి కూడా తొలగించాం’’ అని మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.