కస్టమర్ల దెబ్బకు దిగొస్తున్న Airtel.. ప్లాన్‌ ధరల తగ్గింపు

www.mannamweb.com


ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు జూలై నెల నుంచే అమల్లోకి వచ్చేశాయి. ముందు జియో రీఛార్జ్‌ ధరలను పెంచగా.. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌, వీఐ అదే బాటలో పయనించాయి. ఈ కంపెనీలన్ని ఒక్కో ప్లాన్‌ మీద సుమారు 25 శాతం వరకు పెంచాయి. దాంతో ఒక్కో ప్లాన్‌ ధర సుమారుగా వంద రూపాయల వరకు పెరిగింది. ఇక ప్రైవేటు టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కస్టమర్లు.. వేరే నంబర్లకు మారుతున్నారు. వీరిలో ఎయిర్‌టెల్‌ వినియోగదారులే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇది ఆ కంపెనీకి తీవ్ర నష్టం కలిగించే అంశం. ఇక దెబ్బకు ఎయిర్‌టెల్‌ దిగొస్తుంది. రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను సవరిస్తోంది. ఆ వివరాలు..

ఎయిర్‌టెల్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇతర కంపెనీలకు పోర్ట్‌ అవ్వడం వైపు మొగ్గు చూపడంతో.. వినియోగదారులను కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధరలను సవరించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండింట్లో రీఛార్జ్ ధరలను సవరించింది. రెండు ప్లాన్‌లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది.
రూ.199 ప్యాక్‌..

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం.. ఎయిర్‌టెల్‌ తక్కువ ధరకే 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే ఎంట్రీ-లెవల్ ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ కేవలం రూ. 199కి అందుబాటులో ఉంది. దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యవధితో వస్తుంది. డేటా పూర్తయిన తర్వాత ఒక ఎంబీకు 50 పైసలు వసూలు చేస్తుంది. అలాగే ఈ ప్లాన్ కింద వింక్ మ్యూజిక్, వింక్‌లో ఫ్రీ హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

పోస్ట్ పెయిడ్ కోసం రూ. 449 ప్లాన్‌..

పోస్ట్‌పెయిడ్ రిటైల్ కస్టమర్‌ల కోసం ఎయిర్‌టెల్‌.. ఎంట్రీ లెవల్ ప్లాన్‌.. నెలవారీ అద్దె రుసుము రూ. 449తో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అలాగే 200 జీబీ వరకు రోల్‌ఓవర్‌తో 50 జీబీ నెలవారీ డేటా పొందవచ్చు. దీనితో పాటు కస్టమర్‌లు 5 జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో ఉంటే.. కాంప్లిమెంటరీగా అపరిమిత 5 జీ డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదనపు ప్రయోజనంగా.. కస్టమర్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌కుమరిన్ని కుటుంబ కనెక్షన్‌లను జోడించే అవకాశం కూడా ఉంది.