టాటా.. ఈ పేరుకో చరిత్ర ఉంది.. ఈ పేరుకో విలువ ఉంది. టాటా కంపెనీ ఉత్పత్తులంటే జనాల్లో ఒక నమ్మకం. రతన్ టాటా నాణ్యత, విలువలతో కూడిన వ్యాపారం చేస్తారని ఒక బలమైన అభిప్రాయం జనాల్లో నాటుకుపోయింది. రతన్ టాటా దేశం కోసం, దేశ ప్రజల కోసమే ఆలోచిస్తారనడానికి అనేక రుజువులు ఉన్నాయి. వాటిలో టాటా నానో కారు ఒకటి. టూవీలర్ మీద ఒక కుటుంబం ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తుండడం చూసి చలించిపోయిన రతన్ టాటా.. లక్ష రూపాయలకే నానో కారుని తీసుకొచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు ఫెయిల్ అయ్యింది. అప్పట్లో ఫోన్ కాల్ లో మాట్లాడాలంటే బిల్లు వాచిపోయేది. అలాంటి సమయంలో టాటా ఇండికామ్ తో రూపాయితో పది నిమిషాల పాటు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. గంటకు 6 రూపాయలు మాత్రమే అయ్యేది. అప్పట్లో చాలా మంది పేద, మధ్యతరగతి వారికి ప్రయోజనం చేకూర్చింది. తక్కువ రేటుకే సిమ్ కార్డుతో పాటు టాటా ఇండికాం ఫోన్లు వచ్చాయి. అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత డొకోమో వచ్చింది. కానీ కాలక్రమేణా రేసులో టాటా వెనుకబడిపోయింది.
టాటా పోగొట్టుకున్న వాటిలో నెట్వర్క్, మొబైల్ ఫోన్లు, నానో కారు మాత్రమే కాదు.. ఎయిర్ లైన్స్ కూడా ఉంది. దాని పేరు టాటా ఎయిర్ లైన్స్. దీన్ని 1932లో జేఆర్డీ టాటా స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో టాటా ఎయిర్ లైన్స్ కాస్తా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయ్యింది. దీంతో టాటా ఎయిర్ లైన్స్ పేరు ఎయిర్ ఇండియాగా మారింది. అలా టాటా చేతుల్లోంచి విమానయాన సంస్థ ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1994లో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కి ప్రభుత్వం అనుమతించడంతో ఎయిర్ ఇండియా పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాలను చవి చూసింది. దీంతో 2000-2001 మధ్య కాలంలో ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2007లో నేషనల్ యావియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గా ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనం అయ్యింది. అయినా గానీ భారీ నష్టాలను చవి చూసింది. దీంతో 2017లో ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావించింది. 2021లో టాటా గ్రూప్ కి విక్రయించింది. 2022 జనవరి 27న ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చింది.
ప్రస్తుతం టాటా చేతుల్లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్, విస్తారా ఎయిర్ లైన్స్ ఉన్నాయి. అలా చేతుల్లోంచి వెళ్ళిపోయిన టాటా ఎయిర్ లైన్స్ మరలా 70 ఏళ్ల తర్వాత టాటా చేతుల్లోకి వచ్చింది. ఇంత పెద్ద ఆస్తిని తిరిగి తెచ్చుకున్న టాటాకి.. పోగొట్టుకున్న మిగతా ఆస్తిని తెచ్చుకోవడం కష్టమా? టాటా ఇండికాం ఫోన్ల రూపంలో కోల్పోయిన దాన్ని భారతదేశంలో ఐఫోన్లను తయారు చేయడం ద్వారా తిరిగి సంపాదించుకుంది. బీఎస్ఎన్ఎల్ తో జతకట్టడంతో ఇప్పుడు నెట్వర్క్ విషయంలో స్ట్రాంగ్ అవ్వనుంది. టాటా వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరనుంది. ఒకప్పుడు టెలికాం రంగంలో వెనుకబడిపోయిన టాటాకి ఇప్పుడు నిలబడే అవకాశం దక్కింది. టాటాకి ఇదొక బౌన్స్ బ్యాక్ అని చెప్పవచ్చు.
టాటా ఈ రకంగా నెట్వర్క్ విషయంలో, ఫోన్ల తయారీ విషయంలో సగం నెగ్గింది. ఫ్యూచర్ లో టాటానే సోలోగా టెలికాం, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలోకి వచ్చినా రావచ్చు. ఇక ఎయిర్ లైన్స్ విషయంలో టాటా ఘన విజయాన్ని సాధించింది. ఇక మిగిలింది టాటా నానోనే. త్వరలోనే ఎలక్ట్రిక్ నానో కారుతో రాబోతుంది. కాబట్టి ఆ ఆస్తిని కూడా టాటా తిరిగి సంపాదించుకోనుంది. ఇలా పడిపోయిన చోటే రతన్ టాటా నిలబడుతూ, నిలబెడుతూ వస్తున్నారు.
పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్నారు. టాటా నానోతో కోల్పోయిన సంతోషాలను కూడా నానో ఎలక్ట్రిక్ కారు ద్వారా పొందాలని దాన్ని కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఆస్తి అంటే డబ్బులు కాదు.. సంతోషం.. టాటా గ్రూప్ ఒక వ్యాపారం చేస్తుందంటే అది దాదాపు ఎక్కువ మందికి అందేలా ఉంటుంది అని. అందుకే రతన్ టాటా అన్ని వ్యాపారాల్లోకి విస్తరించాలని అనుకుంటారు. పోగొట్టుకున్న ఆస్తి ఏదైనా ఉంది అంటే అది సంతోషమే. దక్కించుకుంది ఏదైనా ఉందంటే అది కూడా సంతోషమే.