మందుబాబులకు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎక్కువ శాతం దుకాణాలు క్లోజ్ అయ్యాయి అనే వార్తలే కనిపిస్తున్నాయి. పంద్రాగస్టు కూడా వచ్చేస్తోంది. ఆరోజు కూడా మద్యం దుకాణాలు క్లోజ్ లో ఉంటాయి. అయితే అంతకు మించిన ఒక షాక్ ఇప్పుడు వాళ్లకి తగలబోతోంది. అది మద్యం ధరల విషయంలో. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. స్కాచ్ లిక్కర్స్ మీద డ్యూటీ తగ్గించడంతో వాటి ధరలు కాస్త దిగి వచ్చాయి. కానీ, చీప్ లిక్కర్ మీద మాత్రం డ్యూటీ పెంచేశారు. దాంతో రూ.100 నుంచి రూ.200 పలికే మద్యం ధరలు మాత్రం పెరగనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని మద్యం ప్రియులు కాస్త రిలాక్స్ అవ్వండి. ఈ ధరల పెంపు అనేది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ మద్యం ధరల పెంపు జరుగుతోంది.
ఆగస్టు 1 నుంచి కర్ణాటక రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమలు జరుగుతుందని ప్రకటించారు. స్కాచ్ విస్కీలాంటి ప్రీమియం బ్రాండ్ల మీద డ్యూటీ తగ్గించిన ప్రభుత్వం.. చీప్ లిక్కర్ మీద మాత్రం డ్యూటీ పెంచేసింది. కానీ, ఈ ధరల పెంపు అంశానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు అంటున్నారు. వచ్చే వారం నుంచి తగ్గించిన, పెంచిన ధరలు అమలులోకి వస్తాయి అంటున్నారు. మారిన లిక్కర్ పాలసీతో కర్ణాటక రాష్ట్రంలో స్కాచ్ ధరలు తగ్గనున్నాయి. రూ.2,500 నుంచి రూ.2,800గా ఉన్న ప్రీమియం స్కాచ్ విస్కీ ధర.. తగ్గించిన డ్యూటీతో రూ.1500 నుంచి రూ.1800కు వచ్చే అవకాశం ఉంది. మిగిలి రాష్ట్రాల్లో ఈ ధర రూ.1000 నుంచి రూ.1500గా ఉన్నాయి. రాష్ట్రంలో ధరలు ఎక్కువ ఉండటం వల్లే.. ప్రీమియం స్కాచ్ అమ్మకాలు తగ్గిపోయాయి అని ప్రభుత్వం అభిప్రాయ పడింది అంటున్నారు.
ఇప్పటి వరకు తగ్గుముఖంలో ఉన్న స్కాచ్ అమ్మకాలు పెరిగితే.. ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుంది అని భావిస్తున్నారు. ఇప్పుడు సవరించిన ప్రీమియం స్కాచ్ ధరలు అమలులోకి వస్తే.. వీటి అమ్మకాలు పెరుగుతాయి అనుకుంటున్నారు. కానీ, చీప్ లిక్కర్ ధరలు పెరగబోతుండటంతో.. వినియోగదారుల నుంచి విమర్శలు తప్పడం లేదు. చీప్ లిక్కర్ పై డ్యూటీ పెంచడంతో వాటి ధర రూ.100 నుంచి రూ.200, రూ.250 వరకు పెరగనుంది. ఇప్పటికే పలుసార్లు ధరలు పెంచిన ప్రభుత్వం మరోసారి ఎలా పెంచుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారంట. మద్యం ధరలకు సంబంధించి వివరాలను ఈ విధంగా టీవీ కన్నడలో వచ్చిన కథనంలో ప్రచురించింది.