అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌

www.mannamweb.com


అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా.. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు సీఆర్డీఏ అధికారులు. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియను షురూ చేశారు. దీనికి సంబంధించి మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. రాజధాని పరిధిలోని మొత్తం 58 వేల ఎక‌రాలు, 99 డివిజ‌న్లలోని ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొలగిస్తామన్నారు మంత్రి నారాయణ. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించినవారికి ఆయా స్థలాలపై క్లారిటీ వ‌స్తుంద‌ని చెప్పారు. బైట్‌.. నారాయణ, ఏపీ మంత్రి

మరోవైపు.. ఏపీలోని అనధికార లే-అవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. అనధికార లేఅవుట్లు కొనుగోలు చేసి మోసపోకుండా పేపర్లు, టీవీల ద్వారా ప్రజలను అలెర్ట్‌ చేస్తామని చెప్పారు. అనధికార లేఅవుట్ల సర్వే నంబర్లను రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపి.. రిజిస్ట్రేషన్లు చేయకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. అలాగే.. అధికార, అనధికార లేఅవుట్ల సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా మూడు నెలల్లో ప్రత్యేక వెబ్‌సైట్‌ తీసుకోస్తామన్నారు మంత్రి నారాయణ. మొత్తంగా.. కూటమి సర్కార్‌ రాకతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఏపీ రాజధాని పరిధిలోని జంగిల్ క్లియరెన్స్‌‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో కొత్త కళను సంతరించుకోనుంది. ముళ్ల కంపల తొలగింపు ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి కానుండడంతో అమరావతి మళ్లీ కళకళలాడబోతోంది.