అందరికీ విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నాయి. డబ్బులేని కారణంగా మీరు చదువును మధ్యలో ఆపేస్తున్నారా? ప్రతిభ ఉండి కూడా పైసలు లేక పై చదువులు చదవలేకపోతున్నారా? అయితే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు రెడీ అయింది. ఏకంగా ఏడాదికి 48 వేలు అందించనున్నది. ఈ డబ్బుతో మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. ఇంతకీ ఈ స్కాలర్ షిప్స్ కు అర్హులు ఎవరంటే?
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించనున్నది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్యకు ఊతమిచ్చేందుకు ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న వారు ఈ స్కాలర్ షిప్స్ కు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందిస్తారు.
ఓఎన్‌జీసీ ద్వారా ఈ స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థులు ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2024-25 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు ఉండొచ్చు. ఆగస్టు 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు.