వాహనదారులకు అలర్ట్.. రాంగ్ రూట్ లో వెళ్తే.. జైలు శిక్ష తప్పదు

www.mannamweb.com


ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యం, అవగాహన లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజు ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేస్తున్నా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. ఇటీవల ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం. తాజాగా రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నగర ట్రాఫిక్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రోడ్డుపై వెళ్లేవారు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు రూల్స్ అతిక్రమిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. లాంగ్ వెళ్లి యూటర్న్ తీసుకోవడం ఆలస్యం అవుతుందని రాంగ్ రూట్‌లో వెళ్తుంటారు. అలా వెళ్లడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇకపై నిబంధనలు విషయంలో మరింత కఠిన వైఖరి అవలంబించనున్నారు. ఇన్నాళ్లు ట్రాఫిక్ నిబంధనలు బేఖాతర్ చేస్తున్న వారికి జరిమానాలు విధించేవారు.. కానీ వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాంగ్ రూట్‌లో వెళ్లే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. రూల్స్ అతిక్రమించి ప్రమాదాలకు కారణం అయినవారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉందని అంటున్నారు.

హైదరాబాద్‌లో మొదటిసారిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది మేలో ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. నేల వ్యవధిలోనే రాంగ్ సైడ్ వెళ్తూ డ్రైవింగ్ చేసిన 250 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 124 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వారు అన్నారు. ఈ కెమెరాల ద్వారా రాంగ్ రూట్ లో వెళ్లేవారిని గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు అధికారు తెలిపారు. రాంగ్ సైడ్ వాహనాలు నడపడం అనేది మోటర్ వెహికిల్ యాక్ట్ 119/177, 184 సెక్షన్ల ప్రకారం నేరం. వారిపై కొత్తగా ప్రవేశ పెట్టిన భారతీయ న్యాయ సంహిత 125, 281 చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు.రాంగ్ రూట్ లో రావడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు నేరం తీవ్రమైతే జరిమానతో పాటు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. ఇకపై వాహనాదారులు అలర్ట్ గా ఉండాలని కోరారు.