స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెలా

www.mannamweb.com


మహిళలకు ప్రధాన్యత ఇచ్చిన దేశం, సమాజం ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడిప్పుడే ఆడవారు బయటకు వచ్చి.. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లగలుగుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. వారిని ప్రోత్సాహించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. ఇక స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నెలకు ఒకరోజు పిరీయడ్ లీవ్ ఇవ్వడానికి అంగీకరించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది. కటక్ లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవితా పరిదా ఈ ప్రకటన చేశారు. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రవితా పరిదా తెలిపారు. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు వారి నెలసరి సమయంలో మొదటి లేదా.. రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అయితే మహిళా ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. మహిళలకు నెలసరి సెలవు అనేది.. రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. అంతేకాక పీరియడ్స్ సమయంలో ఇబ్బంది పడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవుల మంజూరుపై మోడల్ పాలసీని రూపొందించాలని గత నెల అనగా జూలై 9న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో అందరికి ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

ఇందుకు అనుకూలంగా ఒడిశా ప్రభుత్వం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల గురించి ఆలోచించాలని కోరుతున్నారు. పీరియడ్స్ వేళ అందరికి ఒకేరకమైన ఇబ్బందులు ఉండవు. కొందరికి విపరీతమైన బ్లీడింగ్ సమస్య ఉండగా.. కొందరికి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. ఇక కొందరిలో అయితే వాంతులు, నీరసం వంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ప్రతి నెలా వచ్చే సమస్య కావడంతో చాలా మంది మహిళలు వీటిని భరిస్తారు తప్ప.. ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోరు. కనీసం ప్రభుత్వాలైనా ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే మంచిది అంటున్నారు.