జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్‌ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్‌ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్‌ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు.

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు అయ్యన్నపాత్రుడు. జగన్‌‌తో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా విజయం సాధించిన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని చెప్పారు. రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల వల్ల రాష్ట్రం నష్టపోయిందని.. కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. అలాగే తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంలో పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.. ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘1985వ సంవత్సరంలో పెద్దాయన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు రోజుకి 2000 మందితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు ఈ అన్నదాన కార్యక్రమం రోజుకి 1,00,000 మందికి భోజన వసతి కల్పించే కార్యక్రమంగా మారింది. దీనికి సహకరించిన భక్తులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రోజు పవిత్రమైన మనసుతో అమలు చేస్తున్న అధికారులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు (16/08/2024) నేను నా కుటుంబంతో సహా అన్న ప్రసాదం స్వీకరించటం జరిగింది. భోజనం చాలా రుచిగా ఉంది. శుభ్రత కూడా పాటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.