ఎలన్ మస్క్ జాబ్ ఇంటర్వ్యూ చేస్తే ఆ ప్రశ్న మస్ట్.. మీరు చెప్పేది నిజమో? అబద్ధమో? ఇట్టే తెలిసిపోతుందంతే.

www.mannamweb.com


సాధారణంగా ఉన్న విద్య పూర్తి చేశాక మంచి కంపెనీలో ఉద్యోగం పొందాలని ప్రతి ఒక్కరి ఆశ. అలాగే ఉన్న ఉద్యోగంలో నుంచి ఉన్నత ఉద్యోగంలోకి వెళ్లాలని ఉద్యోగులు ఆశపడుతూ ఉంటారు.

ఇందుకోసం వివిధ కంపెనీలకు అప్లయ్ చేసి ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటారు. అయితే ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ జాబ్ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది. సాధారణంగా ఎలన్ మస్క్ కూడా ఓ కంపెనీ అధినేతే కాబట్టి జాబ్ ఇంటర్వ్యూ చేసే సమయంలో ఉద్యోగ సామర్థ్యాలను తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు కచ్చితంగా అడుగుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ప్రశ్నల వల్ల ఎదుటివారు చెప్పే సమాధానం నిజమో? కాదో? ఇట్టే గ్రహిస్తానని వివరించారు. 2017 నుంచి మస్క్ ఇంటర్వ్యూల్లో ఓ ప్రశ్న కచ్చితంగా అడుగుతున్నారు. మీరు పనిచేసిన కొన్ని క్లిష్టమైన సమస్యల గురించి, వాటిని ఎలా పరిష్కరించారో చెప్పండి? అయితే ఈ ప్రశ్న ప్రామాణిక ఇంటర్వ్యూ ప్రశ్నలా అనిపించినా వాస్తవానికి ఎదుటి మనిషి అబద్ధం చెబుతున్నారో? నిజం చెబుతున్నారో? ఈజీగా కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అభ్యర్థి అనుభవాన్ని డీప్‌గా అనలైజ్ చేయడానికి ఎలన్ మస్క్ ఈ ప్రశ్నను అడుగుతాడు. అభ్యర్థి నిజం చెబుతున్నాడో? అబద్ధం చెబుతున్నాడో? తెలుసుకోవడానికి మస్క్ ఉపయోగించే పద్ధతి మెరుగ్గా పని చేస్తుందని ఇటీవల ఓ పరిశోధన నిర్ధారించింది. ఈ ప్రశ్న ‘అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్’ (ఏఐఎం) అనే సాంకేతికత కింద వస్తుంది. ఏఐఎం టెక్నిక్ అభ్యర్థులు తమ అనుభవాల గురించి వివరణాత్మక కథనాలను పంచుకునేలా ప్రోత్సహించడం ద్వారా అసత్యాలను గుర్తించడంలో ఇంటర్వ్యూలకు సహాయపడటానికి రూపొందించారు. జర్నల్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్ ఇన్ మెమరీ అండ్ కాగ్నిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో వారి ముఖంలో కనిపించే ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా అభ్యర్థి నిజం చెబుతున్నాడో? అబద్ధం చెబుతున్నాడో? కనుగొనవచ్చని పేర్కొన్నారు.

సాధారణంగా నిజం చెప్పే వ్యక్తులు తమ అనుభవాలపై నమ్మకంగా ఉంటారు,. ప్రత్యేకతలను పంచుకోవడంలో సమస్య ఉండదు. వారు ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యను పరిష్కరించడానికి వారు తీసుకున్న చర్యలు, వారు సాధించిన ఫలితాల గురించి చాలా సింపుల్‌గా చెబుతారు. కానీ అబద్ధం చెప్పే వారు మాత్రం తాను అబద్ధం చెబుతున్నాననే విషయం ఎదుటివారికి తెలియకూడదనే ఉద్దేశంతో చాలా తక్కువ మాట్లాడతారు. అలాగే సమాధానం కూడా అస్పష్టంగా ఇస్తారు. ఈ ప్రశ్నకు ఎవరైనా వివరణాత్మక సమాధానం ఇస్తే, వారు అబద్ధం చెబుతున్నారా? లేదా? నిజం చెబుతున్నారా అని చెప్పడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలన్ మస్క్ అభ్యర్థులకు నిజంగా నైపుణ్యాలు, అనుభవం ఉందో లేదో తెలుసుకోవడానికి అతను ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఎవరైనా కష్టమైన సమస్యను ఎలా పరిష్కరించారు అనే దాని గురించి వివరంగా మాట్లాడగలిగితే వారు భవిష్యత్తులో కూడా అదే విధంగా చేయగలరు అనే నమ్మకం ఉంటుందని మస్క్ భావన.