ఇంటర్మీడియట్‌ సిలబస్‌ తగ్గించేందుకు ఇంబర్‌ బోర్డు కసరత్తులు.. పరీక్షల విధానంలోనూ మార్పులు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఇంటర్‌ విద్యలో సంస్కరణలకు కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌తోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

ఇందుకు సంబంధించి సమాలోచనలు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (NCERT) సిలబస్‌తో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్‌ ఎక్కువగా ఉందని, దీన్ని కొంత మేర తగ్గించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా మ్యాథ్‌మెటిక్స్‌ సబ్జెక్టులో సిలబస్‌ కొంత మేర తగ్గించేందుకు సమాయాత్రం అవుతోంది. ప్రస్తుతం ఇంటర్‌ గణితంలో రెండు పేపర్లుగా ఉన్నాయి. సిలబస్‌ తగ్గించాక రెండు పేపర్లనూ కొనసాగించాలా? లేదా ఒక్క పేపరే ఉంచాలా? అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు.

ఇక బైపీసీకి సంబంధించి ఎన్సీఈఆర్టీలో జీవశాస్త్రం ఒక్కటే ఉంది. రాష్ట్ర సిలబస్‌లో మాత్రం వృక్ష, జంతుశాస్త్ర సబ్జెక్టులు విడివిడిగా ఉన్నాయి. వీటి విషయంలోనూ బోర్డు ఓ నిర్ణయానికి రానుంది. అటు సీబీఎస్‌ఈలో 11వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించడం లేదు. అంతర్గత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. ఇలా చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందా? లేదా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. ఇంటర్మీడియట్‌లో జనరల్‌ సబ్జెక్టులతోపాటు ఎలక్టివ్‌గా నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. వీటన్నింటిపై కసరత్తు పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డుకు కొంత సమయం పడుతుంది. అలాగే ఈ మార్పులన్నింటిపై జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని కూడా భావిస్తోంది. ఆ తర్వాత తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

ఆగస్టు 20న ఏపీ ఐసెట్ 2024 సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2024 మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 21న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. సీట్లు పొందిన అభ్యర్థులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఫలితాల విడుదల తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సీట్ల కేటాయింపు ఫలితాలను తెలుసుకోవచ్చు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 24వ తేదీలోగా సంబంధించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.