HYD-విజయవాడ హైవే విస్తరణ.. వేగంగా నిర్మాణ పనులు, మంత్రి కీలక ఆదేశాలు

www.mannamweb.com


హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇదీ ఒకటి. నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇక పండగలు, సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్ని సార్లు కి.మీ మేర వాహనాలు బారులు తీరుతాయి. ప్రస్తుతం ఆ రహదారి నాలుగు వరుసలుగా ఉంది. అయితే ఈ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రి గడ్కరీని కలిసి రహదారి విస్తరణపై చర్చించారు.

రహదారి విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. విజయవాడ జాతీయ రహదారి (65)ని భద్రమైన మార్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ రహదారితో పాటు రాష్ట్రంలో మిగతా జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం (ఆగస్టు 19) సెక్రటేరియట్‌లో జాతీయ రహదారులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరసలుగా విస్తరించేందుకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు.

ఇప్పటికే డీపీఆర్‌ తయారీకి కన్సల్టెంట్లను నియమించేందుకు టెండర్లు పిలిచామన్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా 17 బ్లాక్‌ స్పాట్లను గుర్తించామన్నారు. రూ.422.12 కోట్లతో చేపట్టిన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక మన్నెగూడ నేషనల్ హైవే నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన తేదీని ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. ఇదే కాకుండా నాగ్‌పుర్‌-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణంపై కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ టెండర్‌ ప్రక్రియ పూర్తయినందున భూసేకరణను త్వరతగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. కొన్ని చోట్ల రైతులు అభ్యంతరాలు చెప్పారని.. సెప్టెంబరు 15 నాటికి వారికి నచ్చజెప్పి భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. రైతుల భూములకు మార్కెట్ వాల్యూ ప్రకారం మంచి ధరలను ఇప్పించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నామన్నారు.