గ్రామ సచివాలయాల ప్రక్షాళన, రేషన్‌ డెలివరీ ప్రక్షాళనపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ

www.mannamweb.com


గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ప్రక్షాళన, మొబైల్‌ డెలవరీ వాహనాలతో రేషన్‌ పంపిణీ రద్దుపై ఏపీ క్యాబినెట్‌లో నేడు కీలక చర్చ జరుగనుంది.వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయాల్లో లక్షన్నర మంది పనిచేస్తున్నా వాటి ద్వారా ప్రజలకు నేరుగా ఎలాంటి సేవలు అందకపోవడంతో వాటిని ప్రక్షాళన చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను ప్రక్షాళన చేసే దిశంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్‌లో సచివాలయాల నిర్వహణపై చర్చించనున్నారు.

ఐదేళ్లుగా లైన్‌ డిపార్ట్‌మెంట్‌‌లతో అనుసంధానించకుండానే గ్రామ వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ తప్ప ప్రత్యేకించి ఎలాంటి విధులను నిర్దేశించలేదు.

గ్రామ వార్డు సచివాలయాలకు జాబ్‌ చార్ట్‌లను రూపొందించడంలో కూడా అలసత్వం వహించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు అనుబంధంగా మాత్రమే వాటిని కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రధాన ప్రభుత్వ విభాగాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోవడంతో సచివాలయాలతో ప్రజలకు ఒరిగే సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

పౌర సేవలకు సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కోసమైనా రెవిన్యూ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సివిల్ సప్లైస్ వంటి ప్రభుత్వ విభాగాలను నేరుగా ఆశ్రయించాల్సి వస్తోంది. కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే సచివాలయాలు పరిమితం అయ్యాయి.

గ్రామాల్లో పంచాయితీలు, పట్టణాల్లో మునిసిపాలిటీలతో సంబంధం లేకుండా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సమాంతర వ్యవస్థను తీసుకు వచ్చే ప్రయత్నం జరిగింది. జాతీయ స్థాయిలో ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పరిపాలనలో గుణాత్మక మార్పులు తీసుకురాలేని వ్యవస్థలుగా సచివాలయాలు గుర్తింపు దక్కించుకున్నాయి.

ఈ క్రమంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది సేవల్ని సమర్ధవంతంగా వినియోగించుకునే కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించడంపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
మొబైల్ వాహనాల రద్దు..?

ఏపీలో రేషన్‌ దుకాణాలు ఉండగా మరో ప్రత్యామ్నయ వ్యవస్థగా తీసుకొచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఎండియూలను రద్దు చేసి గతంలో మాదిరి రేషన్ దుకాణాలను కొనసాగించే అంశం క్యాబినెట్‌ ముందుకు రానుంది. ఎండియూలను రద్దు చేసి వాటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడంపై క్యాబినెట్‌లో చర్చిస్తారు.
సెబ్ రద్దు….

ఏపీలో ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్ శాఖను రద్దు చేసి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు కానుంది. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం, నాటు సారా తయారీ కట్టడి, గంజాయిని సాగు చేయడం, అక్రమ మట్టి, ఇసుక రవాణా నియంత్రించేందుకు సెబ్‌ను ఏర్పాటు చేశారు. సెబ్‌ ఏర్పాటుతో ఎక్సైజ్‌ వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. దీంతో సెబ్‌ రద్దు చేయాలని సర్కారు యోచిస్తోంది.

ఏపీ ప్రభుత్వం టెండర్ల కేటాయింపులో తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఇప్పటికే సమగ్ర నివేదిక అందించింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

పోలవరం ఎడమ కాల్వ సామర్థ్యం పెంపు అంశం కూడా క్యాబినెట్ ముందుకు రానుంది. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ విజన్ డాక్యుమెంట్‌పై 12 అంశాల ఆధారంగా రూపొందిన 12అంశాల మిషన్ 2047 డాక్యుమెంట్‌పై క్యాబినెట్‌లో చర్చిస్తారు. మంత్రుల అభిప్రాయాలను సేకరించి దానికి అమోదం తెలియచేయనున్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపే అంశం కూడా క్యాబినెట్ ముందుకు రానుంది.